ప్రజాశక్తి - పర్చూరు : చీరాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై పర్చూరుకు చెందిన కొందరు దాడి చేయడంతో అతని కంటి వద్ద తీవ్ర గాయమైంది. ఈ ఘటన శుక్రవారం పర్చూరు బొమ్మల సెంటర్లో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... చిలకలూరిపేట నుండి చీరాల వెళుతున్న ఆర్టీసీ బస్సుకు పర్చూరు బొమ్మల సెంటర్లో ఓ లారీ అడ్డం వచ్చింది. అక్కడ లారీ డ్రైవర్ కి, బస్సు డ్రైవర్ సయ్యద్ నాగూర్ బాషాకి మధ్య వాగ్వివాదం జరిగింది. ఇద్దరూ కొద్దిసేపు ఘర్షణ పడి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆర్టీసీ బస్సు బస్టాండుకు వెళ్ళి తిరిగి బొమ్మల సెంటర్‌కు చేరుకునే సరికి లారీ డ్రైవర్ కు చెందిన కొందరు వ్యక్తులు బస్సు డ్రైవర్ పై దాడి చేశారు. ఈ దాడిలో నాగూర్ బాషా కుడి కంటికి వద్ద తీవ్ర గాయమవ్వడంతో, అతన్ని చికిత్స నిమిత్తం పర్చూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు.








కామెంట్‌లు (0)