- కోయంబత్తూరుకు చెందిన తండ్రీకొడుకులపై ఏడుగురు దుండగుల దాడి
- ఇన్నోవా కారులో అపహరించి డి6 ఎక్సోటికాలో చితకబాదిన వైనం
- రెండు కిలోల వరకు బంగారు ఆభరణాలు అపహరణ?
ప్రజాశక్తి - ఒంగోలు సిటీ : ఒంగోలు నగరంలో పట్టపగలే బంగారు వ్యాపారులపై దుండగులు దాడి చేసి, బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగును అపహరించిన ఘటన కలకలం రేపింది. కోయంబత్తూరుకు చెందిన బంగారు వ్యాపారులు ఆర్‌డీ బాలాజీ, ఆయన కుమారుడు రత్న శరణ్ ఈ ఘటనలో బాధితులయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వీరిద్దరూ కోయంబత్తూరు నుంచి శబరి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించి బుధవారం ఉదయం ఒంగోలు రైల్వే స్టేషన్‌లో దిగారు. అక్కడి నుంచి ఆటోలో గాంధీ రోడ్డుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఉపాస్ ఆస్పత్రి సమీపంలోకి చేరుకోగానే గుర్తుతెలియని ఇన్నోవా కారులో వచ్చిన ఏడుగురు వ్యక్తులు వారిని అడ్డగించారు. బలవంతంగా ఆటో నుంచి దింపి ఇన్నోవా కారులో ఎక్కించుకుని డి6 ఎక్సోటికా ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ తండ్రీకొడుకులపై దాడి చేసి, వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాల బ్యాగును అపహరించినట్లు సమాచారం. ఆ బ్యాగులో సుమారు రెండు కిలోల వరకు బంగారు ఆభరణాలు ఉండవచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది. దాడిలో గాయపడిన బాధితులు ప్రస్తుతం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దుండగులు ఎవరు? పక్కా ప్రణాళికతోనే ఈ దోపిడీకి పాల్పడ్డారా? అనే కోణాల్లో వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.








కామెంట్‌లు (0)