- చేనేతరంగ అభివృద్ధికి నాలుగు సంస్థలతో ఒప్పందం
• ‘నేతన్న సేవలో’ సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి - చీరాల, బాపట్ల జిల్లా : బిసి సంరక్షణ కోసం త్వరలో చట్టం తీసుకువస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం కొత్తపేట గ్రామంలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నేతన్న సేవలో’ భాగంగా 71,536 చేనేత కుటుంబాలకు రూ.179 కోట్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ చట్టానికి సంబంధించిన ముసాయిదా ఇప్పటికే సిద్ధమైందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమం-అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడడం లేదని అన్నారు. రాష్ర్టాభివృద్ధిని అడ్డుకునేం దుకు జరుగుతున్న కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హ్యాండ్లూమ్ మార్కెటింగ్ అసిస్టెన్స్ కార్యక్రమంతో నేత కార్మికులకు నేరుగా మార్కెట్ అవకాశాలు లభించాయని, ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అమరావతి శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం కూడా వస్తోందని చెప్పారు. విశాఖపట్నంలో రూ.4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు కానుందని చెప్పారు. టిడిపికూటమి అధికారంలోకి వచ్చాక అమరావతి పనులు తిరిగి చేపట్టామని, ఈ నెల 13న రాజధాని ప్రధాన రాజమార్గం సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభిస్తామని తెలిపారు. మావిగన్ ... అంటూ ప్రతిపక్ష నేత నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. కుటుంబానికి ఇల్లు ఎంత అవసరమో రాష్ర్టానికి రాజధాని కూడా అంతే అవసరమన్నారు. పర్యాటకులను ఆకట్టుకునేలా సూర్యలంక, బాపట్ల, చీరాల సముద్ర తీర ప్రాంతాలను తీర్చిదిద్దుతున్నామని, రూ.97 కోట్ల స్వదేశ్ దర్శన్ నిధులతో సూర్యలంక నుంచి చీరాల వరకూ పర్యాటక కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఇసుక సిండికేట్లు ఉన్నాయా?
జిల్లాలో ఇసుక సిండికేట్లు ఉన్నాయా.? ఇసుక మాఫియా నడుస్తోందా.? అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను అడిగారు. ఆయా శాఖల అధికారుల పనితీరు గురించి ప్రజల ముందే సమీక్ష చేశారు. జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల వారీగా తన వద్ద ఉన్న నివేదిక ఆధారం గా వారి పనితీరును వెల్లడించారు. కొందరు అధికారులు వివరణ ఇవ్వబోగా కథలు చెప్పొద్దని, నెల రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దుకోకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే తానే నేరుగా ఇసుక క్వారీలకు వచ్చి పంచాయితీ పెడతానని, ఎవరు తప్పు చేసినా వదలనని హెచ్చరించారు. అనంతరం వివిధ స్టాళ్లను సిఎం చంద్రబాబు సందర్శించారు.
చంద్రబాబు జీవిత చరిత్రను ఆవిష్కరిస్తూ మహతి అనే యువతి 40 పెన్సిళ్లతో రూపొందించిన మైక్రో ఆర్ట్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. బాపట్ల, సూర్యలంక సహా జిల్లాలోని వివిధ బీచ్ ల సమాచారాన్ని ప్రజలకు అందించేలా రూపొందించిన బే ఆఫ్ బాపట్ల వెబ్ సైట్, హ్యాండ్ బుక్ ను విడుదల చేశారు. బాపట్ల లీప్స్ పేరుతో వివిధ రంగాల్లో యువతకు అందించే శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. చేనేత రంగ అభివృద్ధికి సంబంధించి ఫ్యాబ్ ఇండియా సహా నాలుగు సంస్థలతో సిఎం చంద్రబాబు సమక్షంలో అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎస్.సవిత, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, బాపట్ల జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.








కామెంట్‌లు (0)