ఐదుగురు సురక్షితం
ప్రజాశక్తి- కలెక్టరేట్ (విశాఖపట్నం) : ఇటీవల సముద్రంలో పడవ బోల్తా పడి ఆరుగురు గల్లంతైన ఘటన మరవకముందే మరో పడవ బోల్తా పడింది. గురువారం ఉదయం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ కు కిలోమీటర్ దూరంలో మత్స్యకారుల పడవ బోల్తా పడింది. పడవలో ఉన్న ఏడుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్రంలో అలల ఉధృతి అధికంగా ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బాధితుల సమాచారం మేరకు... గురువారం ఉదయం సుమారు నాలుగు గంటలకు ఫిషింగ్ హార్బర్ 7వ నంబర్ జెట్టి నుండి కోటవీధి, ఫెర్రీ రోడ్, వన్‌టౌన్ పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 15 మంది మత్స్యకారులు రెండు చిన్న పడవలలో చేపల వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్లారు. ఏడు గంటల సమయంలో ఫిషింగ్ హార్బర్‌కు కిలోమీటర్ దూరంలో వల వేయగా అది రాళ్లలో చిక్కుకుంది. దానిని విడిపించే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఒక పెద్ద కెరటం రావడంతో పడవ అదుపు తప్పి తిరగబడింది. దీంతో అందులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో పడిపోయారు. సమీపంలోనే ఉన్న మరో పడవలోని మత్స్యకారులు వెంటనే స్పందించి, వారిని రక్షించారు. సముద్రంలో పడిన వారిలో తిక్కడ తాతారావు, గనగళ్ల ఆకాష్ గాయపడ్డారు. అందరూ ఒడ్డుకు చేరుకున్న తర్వాత, గాయపడ్డ ఇద్దరిని కెజిహెచ్ కు తరలించారు. సకాలంలో వైద్య సేవలు అందివ్వడంతో వారు కోలుకొని డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ ప్రమాదంతో రూ.2.5లక్షల విలువ చేసే బోటు, రూ.రెండు లక్షల విలువైన వల పూర్తిగా దెబ్బతిన్నట్లు మత్స్యకారులు చెబుతున్నారు.








కామెంట్‌లు (0)