నరసరావుపేట (పల్నాడు) : ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తమ నివాసానికి వచ్చిన నిర్మాలా సీతారామన్‌కు సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు కలిసి సాదర స్వాగతం పలికారు. అనంతరం.... నరసరావుపేట పర్యటనకు బయలుదేరారు. నరసరావుపేట లో వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద యూనియన్ బ్యాంక్ ఇచ్చిన అంబులెన్సులను ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి నిర్మలా రామన్ కలిసి జెండా ఊపి ప్రారంభించారు. సిఎం, కేంద్ర మంత్రి కలిసి బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. వివిధ రంగాల్లోని లబ్దిదారులకు రుణ వితరణ కార్యక్రమంలో భాగంగా క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు కృష్ణదేవరాయలు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఏర్పాటు చేసిన రుణమేళా కార్యక్రమంలో సిఎం చంద్రబాబు మాట్లాడుతూ .... రైతులు, విద్యార్థులు.. ఇలా అర్హులైన అందరికీ రుణం అందించడమే లక్ష్యమన్నారు. పల్నాడు గడ్డపై పవిత్రమైన కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టామన్నారు. నిన్నటి వరకు పల్నాడు రోషానికి.. పౌరుషానికి నిదర్శనం అని చెప్పారు. పల్నాడు ప్రజలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు నేడు శ్రీకారం చుట్టామన్నారు. సంక్షేమ కార్యక్రమాలతోపాటు ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితేనే నిజమైన అభివృద్ధి అని వివరించారు. ఒకప్పుడు బ్యాంకు లోన్ కష్టమైన పని.. ఇప్పుడు బ్యాంకులే ప్రజల వద్దకు వెళ్లి రుణాలిస్తున్నాయన్నారు. రైతులు, మహిళా సంఘాలు, వ్యాపారులకు రుణాలు ఇచ్చామన్నారు. ఇవాళ ఒక్క రోజే 1.04 లక్షల మందికి బ్యాంకు రుణాలు అందించడం చరిత్ర అని చెప్పారు. గతంలో మెక్రో ఫైనాన్స్, ప్రైవేట్ కంపెనీల అప్పులతో జనం చాలా ఇబ్బందులు పడ్డారు అని తెలిపారు. బ్యాంకులు విలీనం చేసి సమర్థమైన బ్యాంకింగ్ వ్యవస్థ తెచ్చారు అని అన్నారు. డిజిటైజేషన్, బ్యాంక్ లింకేజ్ వంటి కార్యక్రమాలు అమలు చేశారు అని చెప్పారు. బ్యాంకింగ్ వ్యవస్థలో నిర్మలా సీతారామన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారని ప్రశంసించారు. ప్రధాని మోడి వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నారని అన్నారు. మరో 6 జిల్లాల్లో ఇదే తరహాలో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని సిఎం అన్నారు.
అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ .... ప్రతి గ్రామానికీ బ్యాంకు సేవలు ప్రధాని మోడి లక్ష్యం అని చెప్పారు. బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామన్నారు. బ్యాంకులు తమ వైఖరిని మార్చుకున్నాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నానన్నారు. మీ వ్యాపారాలు ముందుకు తీసుకెళ్లేందుకు ఇది అవకాశం అని చెప్పారు. ప్రధాని చెబుతున్న వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు మీ సహకారం కావాలని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మీరంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. గతంలో చిరు వ్యాపారులు వడ్డీ వ్యాపారులతో ఇబ్బంది పడేవార. తోపుడు బండ్ల వారికి గ్యారంటీ లేకుండా బ్యాంకు రుణాలు వచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి రుణాలు అందించిందన్నారు. బ్యాంకు రుణాలు తీసుకోవాలనే ఆలోచన గతంలో చాలా మందికి ఉండేది కాదు అని చెప్పారు. మోడి సూచనతో బ్యాంకులు ప్రజల వద్దకు వెళుతున్నాయన్నారు. ఇవాళ లక్షల మందికి సులువుగా రుణాలు అందుతున్నాయన్నారు. గతంలో కాంగ్రెస్ నేతలు చెప్పిన వారికే బ్యాంకర్లు రుణాలు ఇచ్చేవారని, తీసుకున్నవాళ్లు సరిగా చెల్లించకపోవడంతో ఎన్నో ఇబ్బందులు వచ్చాయన్నారు. ఇప్పుడు గ్రామగ్రామానికీ బ్యాంకులు వెళుతున్నాయన్నారు. ప్రజల అవసరాలను తెలుసుకుని రుణాలు ఇస్తున్నారు అని నిర్మలా సీతారామన్ వివరించారు.








కామెంట్‌లు (0)