ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో 1985 జులై 17న జరిగిన నరమేధం దేశ చరిత్రలో ఒక చెరగని విషాదం. అమాయక దళితులపై జరిగిన ఈ సామూహిక దాడి కేవలం కొందరు వ్యక్తులపై జరిగిన హింస కాదు. అది కులాధిపత్య భావజాలం మానవత్వంపై చేసిన దాడి.
తాగునీటి వినియోగానికి సంబంధించిన ఒక చిన్న వివాదాన్ని సాకుగా చేసుకుని, ఆధిపత్య కులానికి చెందిన మూకలు దళితవాడపై దాడి చేసి పలువురిని అత్యంత క్రూరంగా హత్య చేశాయి. అనేక మందిని తీవ్రంగా గాయపరిచాయి. మహిళలపై దాడులు జరిగాయి. వందలాది కుటుంబాలు గ్రామాన్ని విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది.
కారంచేడు మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. రాజ్యాంగం సమానత్వాన్ని ప్రకటించినా, సమాజంలో కుల వివక్ష, కుల దురహంకారం ఇంకా అంతరించిపోలేదు. దళితులు ఆత్మగౌరవంతో జీవించాలనుకున్నప్పుడు, సమాన హక్కులు కోరినప్పుడు వారిపై దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి అవమానం.
ఈ ఘటన తర్వాత దళిత ఉద్యమాలు మరింత బలపడ్డాయి. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, కుల హింస నిర్మూలన కోసం ప్రజా ఉద్యమాలు విస్తరించాయి. దళితులపై జరిగే అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన చట్టాల అవసరాన్ని ఈ ఘటన బలంగా చాటి చెప్పింది.
ఇప్పటికీ దేశంలో అనేక ప్రాంతాల్లో దళితులు, గిరిజనులు కుల వివక్ష, హింస, సామాజిక బహిష్కరణను ఎదుర్కొంటున్నారు. అందువల్ల కారంచేడు అమరుల త్యాగాన్ని కేవలం స్మరించుకుంటేనే సరిపోదు. కుల వివక్షను నిర్మూలించే సామాజిక ఉద్యమాలను మరింత విస్తృతం చేయాలి. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం విలువలను ప్రతి గ్రామంలో, ప్రతి పాఠశాలలో, ప్రతి కుటుంబంలో ప్రతిబింబించేలా చూడాలి.
ఈ లక్ష్యంతోనే కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) ఆధ్వర్యంలో "కుల వివక్ష లేని సమాజం కోసం – సామాజిక శంఖారావం" కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. గ్రామాల్లో అధ్యయన యాత్రలు, ప్రజా సమావేశాలు, అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ కుల వివక్ష నిర్మూలన, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ప్రజలను చైతన్యపరుస్తున్నారు. అభ్యుదయవాదులు, ప్రజాతంత్రవాదులు, మానవ హక్కుల పరిరక్షకులు విస్తృతంగా పాల్గొని విజయవంతం చేయాలి.
– అండ్ర మాల్యాద్రి,
‘కెవిపిఎస్’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.







కామెంట్‌లు (0)