శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బ్రిక్స్‌ క్రీడా భాగస్వామ్యం

23 ఆగస్టు, 2026

visakha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 12:05 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- రానున్న కాలంలో సభ్య దేశాల మధ్య సహకారం మరింత బలోపేతం

- విశాఖ వేదికగా సంయుక్త ప్రకటనకు ఏకగ్రీవ ఆమోదం

ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : విశాఖపట్నం వేదికగా రెండు రోజులపాటు జరిగిన బ్రిక్స్‌ యువజన, క్రీడా మంత్రుల సమావేశం కీలక నిర్ణయాలతో ఆదివారం ముగిసింది. సభ్య దేశాల మధ్య క్రీడా సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయిస్తూ బ్రిక్స్‌ క్రీడా సంయుక్త ప్రకటనకు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలిపారు. సమావేశంలో భారత కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్‌ మన్సుఖ్‌ మాండవీయ మాట్లాడుతూ బ్రిక్స్‌ క్రీడా భాగస్వామ్యం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణాత్మకంగా ఉండాలన్నారు. క్రీడాకారులు, కోచ్‌ల పరస్పర మార్పిడి, సంయుక్త పోటీలు, క్రీడా శాస్త్ర పరిజ్ఞానం, సాంకేతికతను పంచుకునే వేదికలను ఏర్పాటు చేయాలని సూచించారు.

భారత్‌ అధ్యక్షతన క్రీడా సాంకేతికతపై బ్రిక్స్‌ వర్కింగ్‌ గ్రూప్‌, బ్రిక్స్‌ స్పోర్ట్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కాన్‌క్లేవ్‌, సంప్రదాయ, ఆదివాసీ క్రీడల ప్రదర్శన వంటి మూడు కీలక కార్యక్రమాలను ముందుకు తీసుకొచ్చారు. క్రీడా శాస్త్రం, కృత్రిమ మేధ, డిజిటల్‌ సాంకేతికత, క్రీడా పరికరాల తయారీ, సంప్రదాయ క్రీడల పరిరక్షణలో సభ్య దేశాల సహకారాన్ని పెంచడం వీటి లక్ష్యమని పేర్కొన్నారు. క్రీడా పరికరాల తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు భారత్‌ చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రపంచ స్థాయి తయారీదారులు, సాంకేతిక సంస్థలు, పెట్టుబడిదారులు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. మహిళలు, పారా క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించడంపై భారత్‌ దృష్టి సారిస్తోందన్నారు.

విశాఖలో జరిగిన సమావేశం ద్వారా బ్రిక్స్‌ దేశాల మధ్య క్రీడా రంగంలో పరస్పర సహకారానికి కొత్త దిశ ఏర్పడిందని, భవిష్యత్తులో క్రీడాకారులు, కోచ్‌లు, సాంకేతిక నిపుణుల మధ్య భాగస్వామ్యం మరింత విస్తరించనుందని కేంద్ర క్రీడల శాఖ తెలిపింది.

బ్రిక్స్ ఫ్రెండ్‌షిప్ సైక్లింగ్‌తో సందడి

రెండో రోజు సమావేశానికి ముందు విశాఖలో నిర్వహించిన ‘బ్రిక్స్ ఫ్రెండ్‌షిప్ సైక్లింగ్’ ఉత్సాహభరితంగా సాగింది. సభ్య దేశాల ప్రతినిధులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సైక్లింగ్ చేశారు. నోవాటెల్ హోటల్ నుంచి సి.హారియర్ వరకు, అక్కడి నుంచి తిరిగి నోవాటెల్ వరకు సైకిల్ ర్యాలీ సాగింది. సైక్లింగ్ ఒక అద్భుతమైన వ్యాయామమని, శారీరక దృఢత్వాన్ని పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు కూడా దోహదపడుతుందని మంత్రి మాండవీయ అన్నారు. సైకిల్ ర్యాలీలో కేంద్ర సహాయ మంత్రి రక్షా ఖడ్సే, ఈజిప్ట్‌, ఇథియోపియా, ఇండోనేషియా, యుఎఇ, ఇరాన్‌, దక్షిణాఫ్రికా దేశాల మంత్రులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్