- ఎపి రైతు సంఘం డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని పిన్నాపురం గ్రామంలో గ్రీన్ కో కంపెనీ ఏర్పాటు చేసిన పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని 1600 మెగావాట్లకు పెంచే విషయమై ఈ నెల 19న గ్రామం వెలుపల నిర్వహించిన బూటకపు ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల్లోని పిన్నాపురం, గుమితం తాండ గ్రామాల ప్రజలను అనుమతించకుండా కిరాయి మనుషులతో, ఇప్పటికే గ్రీన్ కో కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందితో నిర్వహించారని సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్ రెడ్డిలు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ. సిరి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన అధికారులు, గ్రీన్ కో కంపెనీ అధికారులు పిన్నాపురం గ్రామానికి దూరంగా పోలీసుల రక్షణ వలయంలో ప్రజా సేకరణ నిర్వహించారని తెలిపారు. ఇప్పటికే పిన్నాపురం గ్రామానికి సంబంధించిన సుమారు 7500 ఎకరాలు, గుమితం తండా గ్రామానికి సంబంధించిన సుమారు 1000 ఎకరాల భూమిని గ్రీన్కో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు కు ప్రభుత్వం స్వాధీనం చేసింది. 100 సంవత్సరాలకు పైగా రైతుల అనుభవంలో ఉన్న ప్రభుత్వ భూములకు రైతులకు హక్కులు కల్పించకుండా రెవెన్యూ అధికారులు మోసం చేశారని పేర్కొన్నారు. హక్కు పత్రాలు లేవనే కారణం చూపి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా భూములను స్వాధీనం చేసుకొని, ఆ భూములపై ఆధారపడ్డ రైతులు, వ్యవసాయ కూలీలను నిర్వాసితులుగా మార్చారన్నారు. సుమారు ఎనిమిది వేలకు పైగా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు వంటి పశువులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఆధారంగా ప్రజలకు జీవనోపాధిగా ఉన్నాయి. ప్రజలకు ఉపాధి, పశువులకు పశుగ్రాసం అందించే భూములను అడ్డగోలుగా గ్రీన్ కో కంపెనీకి ప్రభుత్వం కట్టబెడుతున్నట్లు తెలిపారు.








కామెంట్లు (0)