హైకోర్టు అభ్యంతరం
ప్రజాశక్తి-అమరావతి : డిఎస్‌సి –2025 ఉపాధ్యాయ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద అనర్హులు సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందారనే ఆరోపణలపై నేరుగా సిబిఐ విచారణ కోరడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సర్టిఫికెట్ల ప్రామాణికతపై సందేహాలుంటే తొలుత సంబంధిత జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేయాలని సూచించింది. ప్రతి వ్యవహారంలోనూ సిబిఐ విచారణ కోరడం సమంజసం కాదని, సాధారణ పోలీసు వ్యవస్థ దర్యాప్తు చేయగల అంశాలను కూడా దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థకు అప్పగించడం ద్వారా దాని స్థాయిని తగ్గించినట్లవుతుందని వ్యాఖ్యానించింది. రాష్ట్ర పోలీసు వ్యవస్థ సమర్థంగా పనిచేస్తున్న విషయాన్ని గుర్తించాలని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ చీమలపాటి రవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డిఎస్‌సి –2025 నియామకాల్లో 1,500 మంది అనర్హులు ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రాలతో ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికయ్యారని, ఈ వ్యవహారంపై తాను సెప్టెంబరు 23న సమర్పించిన వినతిపై సమగ్ర విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కర్నూలుకు చెందిన ప్రతాప్‌రెడ్డి సహా తొమ్మిది మంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ వాదిస్తూ, అనర్హులుగా పేర్కొంటున్న అభ్యర్థుల కుటుంబ సభ్యులకు భూములు, స్థిరాస్తులు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు వెల్లడిస్తున్నాయని, ఈ విషయమై జిల్లా విద్యాశాఖాధికారి, సాంఘిక సంక్షేమశాఖ అధికారులకు గతంలోనే ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనర్హుల నియామకాలను రద్దుచేసి, మెరిట్ జాబితాలో తదుపరి స్థానాల్లో ఉన్నవారికి ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రతి వాదన చేస్తూ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లపై అభ్యంతరాలుంటే జిల్లా స్థాయి సెలక్షన్ కమిటీకి ఫిర్యాదు చేయవచ్చని, వాటిని రెవెన్యూ శాఖకు పంపించి పరిశీలించే అధికారం కమిటీకి ఉందన్నారు. కలెక్టర్లకు ఫిర్యాదు చేయకుండా హైకోర్టును ఆశ్రయించడం చెల్లదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్లను ఆదేశించారు. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేశారు.








కామెంట్‌లు (0)