- వెంటనే ఆయనను తొలగించాలి : వామపక్షాలు
ప్రజాశక్తి - యంత్రాంగం : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందని, తక్షణమే ఆయనను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. ఓటర్ల జాబితాలో సవరణ పేరుతో తొలగించిన వారందరికీ తిరిగి ఓటు హక్కు కల్పించాలని నినదించారు. ఓటరు నమోదు దరఖాస్తు 'ఫామ్-6' సవరణలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఓటర్ల డేటాబేస్‌ను కేంద్రీకరించడం వంటి కీలక అంశాలలో పారదర్శకత లోపించిందని, దీనివల్ల లక్షలాది మంది అర్హులైన పౌరుల ఓట్లు తొలగించబడ్డాయని ఆరోపించారు.
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జువ్వల రాంబాబు మాట్లాడారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో మిగిలిన ఇద్దరు చెప్పిన ఏ విషయాన్నీ జ్ఞానేష్ కుమార్ పట్టించుకోలేదన్నారు. ఏకపక్షంగా 13 కోట్ల ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఇటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యానికి వ్యవస్థకు పనికిరారని, తక్షణమే జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. కడప ఆర్‌టిసి బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. అల్లూరి జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యాన ఆందోళన చేపట్టారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్, సిపిఐ నాయకులు పి.చిన్నారావు మాట్లాడుతూ.. ఎన్నికల వ్యవస్థకు మచ్చతెచ్చే విధంగా సిఇసి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో సిపిఎం, సిపిఐ, ఎంసిపిఐ(యు), ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తదితర వామపక్ష పార్టీలు సంయుక్తంగా నిరసన తెలిపాయి.








కామెంట్‌లు (0)