- సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు
దేశ వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటి నుంచి తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ని జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు పిలుపునిచ్చారు. ‘ఆక్రమిద్దాం ఢిల్లీ’ పేరుతో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. సంఘం విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్, జిల్లా కోశాధికారి ఎస్ జ్యోతీశ్వరరావుతో కలిసి శనివారం జగదాంబ సమీపంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నర్సింగరావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చలో ఢిల్లీ పోరాటం జరుగుతుందని, దేశ వ్యాప్తంగా లక్ష మంది పాల్గొంటారని, మన రాష్ట్రం నుంచి ఐదు వేల మంది పాల్గొంటారని తెలిపారు. కార్మికులకు జీతాలు పెంచాలని దేశ వ్యాపితంగా ఉద్యమం సాగుతోందన్నారు. నోయిడాతో సహా ఉత్తర భారత దేశంలోని అనేక రాష్ట్రాలలో గత ఏప్రిల్ నుంచి నిరంతర కార్మిక ఉద్యమాలు సాగుతున్నాయని తెలిపారు. హర్యానాలో విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ కార్మికులు మూడు రోజులు సమ్మె చేసి విద్యుత్ ప్రైవేటీకరణను ఆపగలిగారన్నారు. గత మూడు మాసాల్లో సామాన్యులు వాడుకునే అన్ని నిత్యావసర సరుకుల ధరలు 50 శాతం పైగా ధరలు పెరిగాయని తెలిపారు. గత పది సంవత్సరాలకుపైగా అత్యధిక మంది కార్మికులకు జీతాలు పెరగలేదన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు 26 ఎకరాలను రూ.584 కోట్లకు అమ్మారని, దీన్ని ఘనకార్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయని విమర్శించారు. విశాఖ నగరంలోని భూముల్లో స్టీల్ మార్కెటింగ్ యార్డ్ పెడితే స్టీల్ అమ్మకాలకు బాగా ఉపయోగపడేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అభివృద్ధి చేయడం కంటే అమ్మకానికే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందన్నారు. కార్మికులకు నష్టం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే వరకూ కార్మిక సంఘాల పోరాటం కొనసాగుతుందన్నారు. దేశ వ్యాప్తంగా కార్మికులకు కేంద్ర ప్రభుత్వ వేతన విధానం ప్రకారం కనీస వేతనం నెలకు రూ.42 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)