శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉత్తరాంధ్ర కలలకు రెక్కలుపై ఆగస్టు 1వరకు వేడుకలు

4 గంటల క్రితం

ks
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 09:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కె ఎస్ విశ్వనాథన్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాల్లో భాగంగా"ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు"పేరుతో ఆరు జిల్లాల్లో ఆగస్టు 1 వరకు వారం రోజులపాటు వేడుకలను నిర్వహించనున్నామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కె ఎస్ విశ్వనాథన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి,విశాఖపట్నం జిల్లాల్లో సమాచార పౌర సంబంధాల శాఖ, జిల్లా యంత్రాంగాల ఆధ్వర్యంలో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు "మై డిస్ట్రిక్ట్ టేక్స్ ఆఫ్" థీమ్‌తో క్విజ్, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నారని, విజేతలకు ప్రారంభోత్సవ సభలో బహుమతులు అందజేస్తారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి విమానాశ్రయం ఏ విధంగా తోడ్పడుతుందో వివరిస్తూ, గిరిజన సహకార సంస్థ (జిసిసి) ఆధ్వర్యంలో అరకు కాఫీ, అరకు, పసుపు, స్థానిక ఉత్పత్తుల బ్రాండింగ్, ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో పర్యాటక ప్రాంతాల్లో అవగాహన సదస్సులను నిర్వహిస్తామని పేర్కొన్నారు. జులై 30న సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలో "భోగాపురం - ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు" అంశంపై మహిళలతో రంగోలీ (ముగ్గుల) పురుషులకు క్రికెట్‌, బీచ్‌ ‌వాలీబాల్‌ పోటీలను నిర్వహిస్తారని పేర్కొన్నారు. జులై 31న విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్‌లో ఐదు, పది కిలోమీటర్ల మారథాన్ రన్, సైక్లథాన్, ఫ్లాష్ మాబ్‌లు నిర్వహిస్తారని తెలిపారు. రాత్రివేళల్లో ఉత్తరాంధ్ర వైభవాన్ని, విమానాశ్రయ రూపురేఖలను చాటేలా భారీ "డ్రోన్ షో" నిర్వహించనున్నారని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్