కేంద్రం నుండి రాష్ట్రం లక్షకోట్ల ప్యాకేజీ సాధించాలి
సిపిఎం రాష్ట్ర కమిటీ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్నబ్ తుపాను బాధితులను ఆదుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం తన పలుకుబడిని ఉపయోగించి కేంద్రం నుండి లక్షకోట్ల ప్యాకేజీ సాధించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సూచించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు గురువారం ప్రకటన విడుదల చేశారు. తుపానుకు అతలాకుతలమైన ప్రజలు, రైతాంగానికి ముఖ్యమంత్రి ప్రకటించిన సహాయం సంతృప్తికరంగా లేదని, ప్రజల ప్రాణాలు కాపాడడం ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రకటించినా వివిధ ఘటనల్లో తొమ్మిది మంది మరణించారని తెలిపారు. మృతులకు సంతాపం, వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు సానుభూతి వ్యక్తం చేశారు. ఇది సాధారణ తుపాను కాదని, పైగా ఎల్నినో ప్రభావంతో పంటలు వేయక లేదా ఎండిపోయి దిగుబడి తగ్గిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. కూలీలకు పనిలేదని, కౌలురైతులు పెట్టుబడి పెట్టి, ముందస్తు కౌలు కట్టి దారుణంగా నష్టపోయారని వివరించారు. వృత్తిదారులకు ఈ తుపాను వల్ల ఉపాధి పోయిందని, అతివృష్టికి అనావృష్టికి తోడు ధరలు పెరగడంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టయ్యిందని తెలిపారు. ఈ ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యంతోపాటు ఒక నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్ చేశారు. మరణించిన వారికి రూ.25 లక్షలు, మునిగిపోయిన ఇళ్లకు రూ..25 వేలు, చేనేత, మత్స్యకార్మికులు, చిన్న దుకాణ దారులకు రూ.50 వేలు చొప్పున, ఆటో కార్మికులు, తోపుడు బండ్లకు రూ.25 వేలు చొప్పున ఇవ్వాలని కోరారు. పంటలకిచ్చే సహాయాన్ని ఆహారపంటలకు కనీసం ఎకరాకు రూ.25 వేలకు తగ్గకుండా పెంచాలని, నాలుగు సంవత్సరాల క్రితం నిర్ణయించిన పరిహారాన్నే ఇప్పటికీ కొనసాగించడం సమ్మతం కాదని పేర్కొన్నారు. ఉద్యానవన పంటలకు, కూరగాయల పంటలకు రూ.25 వేల నుండి రూ.50 వేల వరకు, పసుపు, అరటి, పూలతోటలు, తమలపాకు తదితర పంటలకు రూ.1 లక్ష వరకు ఇవ్వాలని కోరారు. పడిపోయిన కొబ్బరి చెట్టుకు రూ.20 వేలు, పాక్షికంగా దెబ్బతింటే రూ.15 వేలు ఇవ్వాలని, కౌలురైతులను గుర్తించి సహాయం వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రైతులకు మరలా పంటకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, రుణ సదుపాయం కల్పించాలని, పాత రుణాలకు వడ్డీ లేకుండా రీషెడ్యూలు చేయాలని, పొలాల్లో చేరిన నీరు తక్షణం తీసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధి పనులు కల్పించి బకాయిలు లేకుండా చూడాలని, వ్యవసాయ కార్మికులకు పనిలేనందున ప్రతి కుటుంబానికి రూ.10 వేలు చొప్పున అదనపు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా భరించాలని, కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వానికున్న పలుకుబడిని ఉపయోగించి తుపాను, కరువు సహాయార్థం వెంటనే సాధించేలా చూడాలని సూచించారు.








కామెంట్లు (0)