ఎపి రైతు సంఘం డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అర్నబ్ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వాన్ని కోరింది. పశ్చిమ గోదావరి, కాకినాడ, బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల వంటి కోస్తా జిల్లాల్లో ఈ తుపాను వల్ల కురిసిన, అకాల భారీ వర్షాలు, ఈదురు గాలులతో వ్యవసాయ రంగానికి అపార నష్టం జరిగిందని సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి చెట్లు, బొప్పాయి, తమలపాకులు, కాఫీ, మిరియాల తోటలు, కూరగాయలు, మిర్చి, పత్తి వంటి పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయని తెలిపారు. అర్నబ్ తుపానుతో కౌలు రైతులే ప్రధానంగా నష్టపోయినందున.. ప్రభుత్వం అందించే సహాయం, నష్టపరిహారం భూ యజమానులకు కాకుండా కౌలు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నష్ట పరిహరం వరికి ఎకరాకు రూ.25 వేలు, ఉద్యాన పంటలకు ఎకరాకు రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అరటి, ఆకుతోటలు, జీడిమామిడికి రూ.లక్ష, ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.20 వేలు చొప్పున ఇవ్వాలని కోరారు. నష్ట పరిహారం పంపిణీలో జాప్యం లేకుండా 15 రోజులలోపు నష్టపోయిన రైతులకు అందించాలన్నారు.
కౌలు రైతులను ఆదుకోవాలి
అర్నబ్ తుపాను వల్ల నష్టపోయిన కౌలు రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని, ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం కౌలు రైతులకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పెరిగిన వ్యవసాయ ఖర్చులను దృష్టిలో పెట్టుకొని నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించాలని కోరింది. వ్యవసాయ పంపు సెట్లు, యంత్ర పరికరాలకు, పశువులకు ఇతర అనుబంధ పనిముట్లకు జరిగిన నష్టానికి ప్రభుత్వం నుంచి ప్రకటన లేకపోవడం అన్యాయమని సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.బలరామ్, ఎం.హరిబాబు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పడిపోయిన కొబ్బరిచెట్లకు రూ.20 వేలు, పాక్షికంగా దెబ్బతింటే రూ.15 వేలు చొప్పున ఇవ్వాలని కోరారు. కౌలు రైతులను గుర్తించి సహాయం వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.








కామెంట్లు (0)