శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్‌‌హెచ్‌ఎం పథకాల అమలుతీరుపై కేంద్రం బృందాల పరిశీలన

6 రోజుల క్రితం

nhm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 08:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- నేటి నుంచి ప్రారంభం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద అమలవుతున్న పలు పథకాల పనితీరును కేంద్రప్రభుత్వానికి చెందిన బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నాయి. శనివారం విజయవాడకు చేరుకున్న ఈ బృందాలు ఆదివారం నుంచి తమ పర్యటనను ప్రారంభించనున్నాయి. ఈ నెల 26వ తేదీ వరకు ఐదు రోజుల పాటు అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించి వైద్య సేవల అమలుతీరును క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌, ఎన్‌హెచ్‌ఎం మిషన్‌ డైరెక్టర్‌ కెవిఎన్‌ చక్రధర్‌బాబుతో కేంద్ర బృందాల ప్రతినిధులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న ఎన్‌హెచ్‌ఎం పథకాలు, వాటి పురోగతిని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా చక్రధర్‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్‌హెచ్‌ఎం పథకాల అమలులో భాగంగా చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పన, వైద్య సేవల విస్తరణ, పర్యవేక్షణ, సిబ్బంది నియామకాలు తదితర అంశాలను కేంద్ర బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాయని తెలిపారు. ఈ నివేదిక ఆధారంగానే ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్‌ ప్లాన్‌ (పీఐపీ) ద్వారా బడ్జెట్‌ కేటాయింపులు జరుగుతాయని వివరించారు. సంజీవని ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో అమలు చేసేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. డిసెంబరు 10న రాష్ట్రవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా పరీక్షలు(ట్ర‌య‌ల్ ర‌న్‌) నిర్వహించి, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 28 జిల్లాల్లో ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మాతృ మ‌ర‌ణాల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించామ‌ని, బాలిక‌లు, గ‌ర్భిణిల‌లో ర‌క్త‌హీన‌త నివార‌ణ‌కు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. అలాగే క్యాన్స‌ర్ ముంద‌స్తు నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా రాష్ట్రంలో 4.52 ల‌క్ష‌ల బాలిక‌ల‌కు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను వేసి ల‌క్ష్యాన్ని అధిగ‌మించామ‌న్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ డాక్టర్‌ వెంకటరమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్