- బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకరరావు
మంగళగిరి: కుల గణన ఫార్మాట్‌లో ఒబిసి కాలమ్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తులు, ఉద్యమాలు చేసినా కేంద్రం మొద్దు నిద్ర వీడడం లేదని, అందుకే సమరశీల పోరాట కార్యాచరణ రూపకల్పన కోసం అక్టోబర్ ఎనిమిది ఢిల్లీలో జాతీయ అఖిలపక్ష మేధావుల సభను నిర్వహించనున్నామని ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకరరావు తెలిపారు. ‘సమగ్ర ఒబిసి కులగణన- అక్టోబర్ ఎనిమిది ఢిల్లీ అఖిలపక్ష సమావేశం’, హైదరాబాద్ ఒబిసి కులగణన సదస్సు డిక్లరేషన్ అంశాలపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జాతీయ జన గణనలో సమగ్ర కుల గణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం చెప్పినా కుల గణన ఫార్మాట్‌లో ఒబిసి కాలమ్ ఏర్పాటు చేయకుండా 2011 నాటి లోప భూయిష్ట విధానంతోనే ముందుకెళ్తోందని విమర్శించారు. తొలి దశ జనగణలో ఎస్‌సినా? ఎస్‌టినా? ఇతరులా అని మాత్రమే అడిగారని, ఒబిసి కాలమ్ పెట్టలేదని, అన్ని ఒబిసి సంఘాలు విజ్ఞాపనలిస్తే, కేంద్రం రెండవ దశలో కుల గణన చేపడతామని బుకాయించిందని, రెండవ దశ జనగణనలో కూడా ఆ పని చేయకుండా మోసపూరితంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. బీహార్, తెలంగాణ మోడల్‌లో ఒబిసి కాలమ్‌తో పాటు, ప్రతి కులానికి ఒక యూనిక్ నంబర్ కేటాయించి సమగ్రంగా కుల గణన జరపాలని డిమాండ్ చేశారు. ఒకే రకమైన వృత్తి- ఒకేస్థాయి, సామాజిక హోదా గల కులాలు, ఉపకులాలకు కలిపి ఒకే కులంగా చేసి యూనిక్ నంబర్ కేటాయించాలన్నారు. ఈనెల 11న తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపిన విధంగానే, ప్రతి కులానికి ఒక యూనిక్ నంబర్ కేటాయించి, ఒబిసి కాలంతో అన్ని ఒబిసి కులాల జనగణన చేయాలని ఎపి శాసనసభలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సిఎం చంద్రబాబును కోరారు.








కామెంట్‌లు (0)