గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచుక్కా రామయ్య సేవ నేటి తరానికి స్ఫూర్తి..

53 నిమిషాల క్రితం

చుక్కా రామయ్య  సేవ నేటి తరానికి స్ఫూర్తి 
-జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సిపిఎం రాష్ట్ర కమిటీ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 12:33 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సిపిఎం రాష్ట్ర కమిటీ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వందేళ్ళు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా విద్యావేత్త, ఎమ్మెల్సీ, ఐఐటి రామయ్యగా పేరుపొందిన చుక్కారామయ్య సమాజానికి చేసిన సేవ నేటి తరానికి స్పూర్తిగా ఉంటుందని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు చుక్కా రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గురువారం లేఖ రాశారు. ఎంతోమంది విద్యార్థులు, మేధావులను తీర్చిదిద్ది రెండు తెలుగు రాష్ట్రాలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారని ఈ లేఖలో ఆయన పేర్కొన్నారు. విద్య వ్యాపారంగా మారిన నేపథ్యంలో యావజ్జీవితమూ చదువుల సరస్వతికి అంకితం చేశారని, ఉత్తమ ఉపాధ్యాయుడిగా, ప్రజా సేవకుడిగా ఎంతో సామాజిక స్పృహతో పనిచేశారని తెలిపారు. యువకుడిగా ఉన్నప్పుడే తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని అరెస్టయి జైలు జీవితం అనుభవించి, నేటి యువతరానికి పోరాట స్పూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో చేరినా సామాజిక చైతన్యాన్ని పెంపొందించడం మరువలేదని, సులువైన మార్గం ద్వారా బోధించే పద్దతి విద్యార్థులకు ఇట్టే ఆకళింపు అయ్యేదని ఎందరో విద్యార్థులు చెప్పుకుంటారని తెలిపారు. ఉపాధ్యాయ నేతగా, టీచర్ ఎమ్మెల్సీగా శాసన మండలిలో చేసిన ప్రసంగాలు ఎంతో సమాచారంతో, ఉత్తేజకరంగా ఉండేవని, ఎన్ని పదవులు, బాధ్యతల్లో ఉన్నప్పటికీ పేద, దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మానలేని గుర్తు చేశారు. ఈ సందర్భంగా జీవిత అనుభవాలను వివరిస్తూ మిత్రబృందం వెలువరించే సావనీర్ “మన చుక్కా రామయ్య వందేళ్ళ పండగ” ఈ తరానికి అందించే పాఠంగా ఉంటుందని, మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

శత వసంతాల చుక్కా రామయ్యకు శుభాభినందనలు

​ప్రఖ్యాత విద్యావేత్త, ఐఐటి రామయ్యగా తెలుగు ప్రజలకు సుపరిచితులైన చుక్కా రామయ్య శత వసంతాలు పూర్తి చేసుకొని చైతన్యస్ఫూర్తిగా నిలిచారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో విద్యార్థి దశలోనే పోరుబాట పట్టిన రాయమ్య అనంతరం విద్యా రంగ అభివృద్ధికి, ప్రత్యేకించి ఐఐటి విద్యను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడంలో ఎనలేని కృషి చేశారు. విద్యావేత్తగానూ, శాసనమండలి సభ్యునిగానూ జీవితం అసాంతం ప్రజాసేవలో తరించిన రామయ్య మాస్టారుకు వందేళ్ల జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా హైదరాబాద్‌‌లో శుక్రవారం నిర్వహించే వేడుకల్లో ‘మన చుక్కా రామయ్య వందేళ్ళ పండగ’ సావనీర్‌‌ను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి సుదర్శన్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్