శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డిసెంబర్ 3న బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సిఐటియు మద్దతు

6 రోజుల క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 07:07 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఐడిబిఐ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ

ప్రజాశక్తి - విజయవాడ : ప్రభుత్వ రంగంలోని ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడిబిఐ)ను మోడీ ప్రభుత్వం అతి కారుచౌకగా కెనడాకు చెందిన విదేశీ ఫైనాన్స్ కంపెనీ ఫెయిర్‌ఫాక్స్ హోల్డింగ్స్‌కు కట్టబెట్టడాన్ని సిఐటియు ఖండిస్తున్నదని రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులుల సి.హెచ్.నరసింగరావు, ఏ.వి.నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులను అమ్మేయడానికి, వాటిలో ఉన్న ప్రభుత్వ నియంత్రణను వదులుకోవడానికి ప్రారంభ సూచికగా ఈ బ్యాంకును అమ్మివేయడాన్ని సిఐటియు వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఐడిబిఐ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ డిసెంబర్ 3న బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సిఐటియు మద్దతు ప్రకటించారు. వారు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ''బ్యాంకులను ఏ ధరకైనా అమ్మివేయాలనేది మోడీ ప్రభుత్వ సిద్ధాతం. ప్రభుత్వం కోల్పోయే ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. ఐడిబిఐలో ఉన్న ప్రభుత్వ వాటా 60.7 శాతాన్ని రూ. 52,878 కోట్లకు అమ్మాలని నిర్ణయించింది. తను నిర్ణయించిన ఒక్కో వాటా కనీస ధర 94.42 రూపాయలకు కట్టుబడకుండా మరియు ఫెయిర్ ఫాక్స్ బిడ్ వేసిన రూ. 81లు కూడా కాకుండా కేవలం 75.99 రూపాయలకు అమ్మేయాలని నిర్ణయించింది. బడ్జెట్ లోటును పూడ్చుకునేందుకు ప్రభుత్వ వాటాలను అమ్మివేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వం బడ్జెట్‌కు కూడా సరైన జమలు రాకుండా ప్రజా ధనాన్ని నష్టం చేసేందుకు సిద్ధమైంది.

మోడీ ప్రభుత్వం అతి తక్కువ రేటుకు అమ్మాలనుకున్న ఐడిబిఐకు 2025`26 ఆర్థిక సంవత్సరంలో రూ. 9,513 కోట్లు నికర లాభం వచ్చింది. గత సంవత్సరం లాభం కంటే ఇది 27 శాతం ఎక్కువ. ఐడిబిఐ డిపాజిట్లు మరియు రుణాలు కలసి మొత్తం వ్యాపారం రూ. 6 లక్షల కోట్లు దాటింది. ఇటువంటి బంగారు గుడ్లు పెట్టే బాతును కోసుకుతిన్న చందంగా ఐడిబిఐను బంగారు పళ్లెంలో పెట్టి విదేశీ ప్రైవేట్ ద్రవ్య పెట్టుబడికి దోచిపెడుతోంది.

స్వదేశీ జపం చేసే బీజేపీ ప్రభుత్వం, ప్రభుత్వ బడ్జెట్‌కు కూడా నష్టం చేస్తూ విదేశీ ప్రైవేట్ ద్రవ్య పెట్టుబడులకు సాష్టాంగపడింది. పెండింగ్ పన్ను వివాదాల్లో తనుకనుక ఓడిపోతే ఫెయిర్‌ఫాక్స్ కట్టాల్సిన 697 కోట్ల రూపాయలకు పైగా ఉన్న మొత్తాన్ని ప్రభుత్వం రద్దు చేస్తుంది.

మోడీ ప్రభుత్వం బ్యాంకులనే కాకుండా ఇతర జాతీయ రహదారులు, విద్యుత్తు, పోర్టులు, బొగ్గు, గనుల రంగాల్లో ప్రభుత్వ రంగ ఆస్తులను చాలా కారుచౌకగా అమ్మివేస్తున్నది. ప్రభుత్వ ఆస్తులంటే ప్రజల ఆస్తులు. ఇప్పటికే ప్రజల భూములను, ప్రకతి వనరులను ప్రైవేట్ కార్పొరేట్లకు కట్టబెడుతున్న ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని కూడా వారికి అప్పగిస్తోంది. ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిఐటియు డిసెంబర్ 1 నుండి 3 వరకూ ఢిల్లీలో చేయబోయే పార్లమెంట్ మార్చ్‌కు మద్దతునివ్వాలని బ్యాంకు ఉద్యోగులను కోరుతున్నాం'' అని పేర్కొన్నారు .

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్