శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అర్నబ్ తుపాను నష్టం పై సిఎం చంద్రబాబు కీలక సమీక్ష

1 గంట క్రితం

CM Chandrababu holds a key review on the damage caused by Cyclone Arnab
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 03:57 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అమరావతి : అర్నబ్ తుపాను కారణంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడమే లక్ష్యంగా పనిచేయాలని ఎపి సిఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో రెండో రోజు పర్యటనకు బయలుదేరే ముందు కూడా ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సరఫరా, రహదారులు, సమాచార వ్యవస్థల పునరుద్ధరణ పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న సిబ్బందితో నేరుగా మాట్లాడి పురోగతిని పరిశీలిస్తున్నారు. సిఎం స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో తుపాను సహాయక చర్యలను అధికారులు మరింత వేగంగా కొనసాగిస్తున్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి మాట్లాడుతూ .... తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గత నాలుగు రోజులుగా టెలీకాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు.


తుపాను ధాటికి దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వంలోని వివిధ శాఖలు ముమ్మరంగా పనిచేస్తున్నాయన్నారు. ఇందులో భాగంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని సిఎం తెలిపారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన 5,404 గ్రామాల్లో శుక్రవారం ఉదయం 10 గంటల వరకు 4,881 గ్రామాలకు తిరిగి కరెంట్ అందించారు. అంటే దాదాపు 90 శాతం గ్రామాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పూర్తయిందన్నారు. దెబ్బతిన్న 552 సబ్‌స్టేషన్లలో 513 మళ్లీ పనిచేయడం ప్రారంభించాయని తెలిపారు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుందన్నారు.


తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం పునరుద్ధరణ పనులు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. కోనసీమలో 316 గ్రామాలకు గాను 87 గ్రామాలకు, పశ్చిమ గోదావరిలో 318 గ్రామాలకు గాను 154 గ్రామాలకు మాత్రమే విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చిందన్నారు. మరోవైపు కృష్ణా జిల్లాలో ఏపీసీపీడీసీఎల్ పరిధిలో తుపాను ప్రభావానికి గురైన 915 గ్రామాల్లో 867 గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారని తెలిపారు.


ఇక సమాచార, రవాణా వ్యవస్థలను కూడా క్రమంగా గాడిలో పెడుతున్నారని సిఎం తెలిపారు. తుపాను కారణంగా దెబ్బతిన్న 1,045 మొబైల్ టవర్లలో ఇప్పటివరకు 661 తిరిగి పనిచేయడం ప్రారంభించాయన్నారు. రహదారులపై కూలిన 2,270 చెట్లను తొలగించగా, ఆర్‌అండ్‌బీ రహదారుల్లో 137 చోట్ల నిలిచిపోయిన రాకపోకల్లో 119 ప్రాంతాల్లో రాకపోకలను పునరుద్ధరించారని అన్నారు.


పంట నష్టం తీవ్రం.. పరిశీలించనున్న కేంద్ర బృందాలు ....

తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, ఉద్యాన రంగాలు తీవ్రంగా నష్టపోయాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం .... 16 జిల్లాల్లో 3,52,254 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 23,211 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగాయన్నారు. ఈ నష్టంపై వాస్తవ పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నాయని, వారికి క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని వివరించి, గరిష్ఠంగా కేంద్ర సహాయం పొందేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ముఖ్యమంత్రి వివరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్