రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ నడవాలి...
వైసీపీ హయాంలో గంజాయి, మత్తుపదార్థాలు అందితే కూటమి పాలనలో ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందుతున్నాయి...
చొప్పెల్లలో మీడియా సమావేశంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు...
ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటీ నిలబెట్టుకుంటూ ముందుకు వెళుతుందని, నాడు చెప్పాం... నేడు చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలియజేశారు. ఆలమూరు మండల పరిధి 18 గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఆయన నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్, భాజపా నాయకులు సుంకర శ్రీరాములు తదితరులతో కలిసి పాల్గొన్నారు. శుక్రవారం చొప్పెల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ పాలన ఏవిధంగా నడిచిందో కూటమిపాలన ఏ విధంగా నడుస్తుందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అట్టడుగుకు దిగజారిపోతే కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. వైసీపీ పాలనలో జరిగిన ఆర్థికపరమైన అరాచకాలను, విధ్వంసాన్ని సరిదిద్దడానికి రెండున్నర ఏళ్ల కాలం పట్టిందన్నారు. ప్రధానమంత్రి మోడీ సహాయ సహకారాలతో, ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన దక్షతతో,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి, యువ నాయకుడు నారా లోకేష్ చొరవతో ఈనాడు రాష్ట్రం ముందుకు వెళుతుందన్నారు. వైసిపి పాలనలో రాష్ట్రం రివర్స్ గేర్ లో వెనక్కి వెళితే కూటమి పాలనలో రాష్ట్రం ఫార్వర్డ్ గేర్ లో ముందుకు వెళుతుందన్నారు. వెనక్కిపోయిన రాష్ట్రం రెట్టింపు వేగంతో అభివృద్ధి పథం వైపు పయనిస్తుందన్నారు. ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో అదే చేస్తున్నామన్నారు. మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పించామన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిని వైసీపీ పాలనలో అడవిలా తయారు చేస్తే కూటమి పాలనలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. పోలవరాన్ని వైసీపీ పాలనలో వదిలేస్తే కూటమిపాలనలో పోలవరం ప్రాజెక్టు పనులు శర వేగంగా జరుగుతున్నాయన్నారు. నాడు పరిశ్రమలు పారిపోతే, లక్షలాది, కోట్లాది రూపాయల పరిశ్రమలను నేడు రాష్ట్రానికి తీసుకువచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా గూగుల్ వంటి పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ప్రజల దగ్గరకు వెళ్తున్నప్పుడు వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు నడుస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలిచి ట్రిపుల్ ఇంజన్ సర్కార్ గా నడవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. వైసీపీ హయాంలో యువతకు గంజాయి, మత్తు పదార్థాలు విచ్చలవిడిగా స్వైర విహారం చేసేవని, ఎన్డీఏ కూటమి వాటిని అదుపులోకి తీసుకొని వచ్చి యువతకు డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు, పరిశ్రమల ఏర్పాటుకు ఆర్థిక సహాయం, పరిశ్రమలు తీసుకుని వస్తూ ఉద్యోగ ఉపాధి కల్పన చేస్తుందన్నారు. అర్నబ్ తుఫాను వస్తే ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపు, అనుభవం కారణం అన్నారు. ఆయన అధికారులను, ప్రజలను, యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి 1996 హరికేన్ వంటి ఉపద్రవంలా అర్నబ్ తుఫాను ముంచుకొచ్చినా ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా బయటపడ్డామన్నారు. రాజకీయ స్థిరత్వం తో కూడిన ప్రభుత్వం కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఉండడం అభివృద్ధికి నాంది పలుకుతుందన్నారు. వైసీపీ పాలనలో ప్రభుత్వ ఆస్తుల అమ్మకం అప్పులు తప్ప అభివృద్ధి లేదన్నారు. కూటమి పాలనలో అభివృద్ధిలో అన్ని విధాలా ముందడుగు వేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనని సరిదిద్దడానికి ఈ రెండు సంవత్సరాలు నాలుగు నెలల కాలం పట్టిందని వ్యాఖ్యానించారు. అయినా గ్రామాల్లో కానీ రాష్ట్రంలో కానీ అభివృద్ధి పరుగులు పెట్టించడం మానలేదన్నారు. కూటమిపాలనతో రాష్ట్రం మరింత ముందడుగు వేసి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డానికి, ప్రణాళికాబద్ధంగా వేస్తున్న అడుగులు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడతాయన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి అభ్యర్థులే ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడం ఖాయమన్నారు. కూటమి పార్టీల నడుమ సమన్వయం లోపం ఏర్పడుతుందని వైసీపీ నాయకులు ఎంతగానో ఎదురు చూశారని అయితే కూటమిలో ఉన్న పార్టీలన్నీ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని ముందడుగు వేస్తున్నాయన్నారు.
30 ఆలమూరు 1 : చొప్పెల్లలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎంఎల్ఏ బండారు








కామెంట్లు (0)