- రూ.30 కోట్లకు కడప జెడ్పి చైర్మన్
- బిజెపి నేత వీరాశివారెడ్డి ఆరోపణ
ప్రజాశక్తి-కమలాపురం: కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.30 కోట్లకు మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత జెడ్పి చైర్మన్ పుత్తా నరసింహారెడ్డికి విక్రయించారని కమలాపురం మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత వీరశివారెడ్డి ఆరోపించారు. శనివారం కమలాపురం మండలం కోగటం గ్రామంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిడిపిలో డబ్బులు ఉన్నవాడికే పదవులు అని, చంద్రబాబు, లోకేష్‌కు డబ్బే ముఖ్యమని విమర్శించారు. కమలాపురం నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికల్లో పుత్తా నరసింహారెడ్డి రౌడీయిజం చేశారని, ఒక్కో పదవికి ఒక్కో రేటు పెట్టి రూ.50 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. జిల్లాలో పెద్ద పదవిని మంచి నడవడిక కలిగిన వారికి ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తన స్వగ్రామం చుట్టుపక్కల 500 ఎకరాల భూమిని కాజేశారని, కోగటం గ్రామంలో జరిగే ఏ ఎన్నికల్లోనైనా పుత్తా గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. బిజెపిలో తాను మూడు రోజుల క్రితమే చేరానని, నా స్వగ్రామం వచ్చి అగ్గిపుల్ల గీస్తే ఊరుకోవాలా? ఆర్పుకునే ప్రయత్నంలోనే ఈ వ్యాఖ్యలు చేశానని మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. నియోజకవర్గ పునర్విభజన జరిగితే ఎంపికి, ఎమ్మెల్యేకు తానుగానీ తన వారసులుగానీ పోటీలో ఉంటారని తెలిపారు.








కామెంట్లు (0)