ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మొబైల్ టవర్ల ఏర్పాటులో జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతాలతో సహా రాష్ట్రం నలుమూలలా కనెక్టివిటీ ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని, అవసరమైతే ఇన్సెంటివ్‌లు కూడా ఇస్తామని ముందే చెప్పినప్పుడు అధికారులు భూమి కేటాయింపుల్లో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. కలెక్టర్ల సదస్సులో తొలిరోజైన గురువారం ఈ అంశంపై ఐటి శాఖ కార్యదర్శి కాలంటనేని బాస్కర్ ఇచ్చిన ప్రజెంటేషన్‌పై ఆయన స్పందిస్తూ.. బాధ్యతను వేరొకరిపై నెట్టేసే పద్ధతి మానుకుని స్వయంగా బాధ్యత తీసుకుని పని చేయాలని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న 18 రెవెన్యూ స్థలాలను రాబోయే ఏడు రోజుల్లోగా టెలికాం సంస్థలకు అప్పగించాలని కలెక్టర్లకు గడువు విధించారు. అలాగే అటవీ అనుమతులు పెండింగ్‌లో ఉన్న చోట్ల, అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని పది రోజుల్లోగా క్లియరెన్స్ పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు చొరవ తీసుకుని ముందస్తుగా పనిచేయాలని, వచ్చే కలెక్టర్ల సదస్సు నాటికి మళ్లీ ఇలాంటి కారణాలు వినడానికి తాను సిద్ధంగా లేనని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికీ 4జీ, 5జీ సేవలను నిరంతరాయంగా అందించేందుకు చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద బీఎస్ఎన్ఎల్, జియో సంస్థల ద్వారా రాష్ట్రానికి మొత్తం 1,023 టెలికాం టవర్లు మంజూరయ్యాయని తెలిపారు. వీటిలో ఇప్పటికే 143 చోట్ల పనులు పూర్తయి సిగ్నల్స్ వస్తున్నాయని, 428 చోట్ల పనులు జరుగుతున్నాయని, భూమి అప్పగించిన 423 ప్రాంతాల్లో పనులు మొదలుకావాల్సి ఉందని పేర్కొన్నారు. ఇంకా వివిధ జిల్లాల్లో 18 చోట్ల రెవెన్యూ భూమి, మరో 11 చోట్ల అటవీ భూముల క్లియరెన్స్ పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమి ఇవ్వడంతో పాటు విద్యుత్ ఖర్చులను భరిస్తూ తీసుకొచ్చిన ‘వంద శాతం టెలికాం కనెక్టివిటీ’ పథకం గురించి కూడా ఐటీ కార్యదర్శి వివరించారు.రాష్ట్ర వ్యాప్తంగా 2,359 ప్రాంతాల్లో ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్-ఐడియా, బీఎస్ఎన్ఎల్ ద్వారా టవర్ల నిర్మాణాన్ని కేటాయించామని తెలిపారు.ఒక్కో టవర్‌కు కేవలం 5 నుంచి 5.5 సెంట్ల భూమి మాత్రమే అవసరమవుతుందని, కలెక్టర్లకే నేరుగా భూమి ఇచ్చే అధికారాలు ఉన్నందున ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపకుండా స్థానికంగానే త్వరగా అప్పగించాలని కలెక్టర్లను కోరారు.దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఈ 2,359 సైట్లకు సంబంధించి నెల రోజుల్లోగా భూముల బదిలీ ప్రక్రియ పూర్తి కావాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వచ్చే కలెక్టర్ల కాన్ఫరెన్స్ నాటికి రాష్ట్రంలో వంద శాతం కవరేజ్ సాధించాలని ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో ఒక్క గ్రామంలో కూడా సిగ్నల్ లేని పరిస్థితి కనిపించకూడదని స్పష్టం చేశారు. రోడ్డు లేదనే కారణంతో టవర్ల నిర్మాణాన్ని ఆపవద్దని, ఉపాధి హామీ పథకం కిందైనా మట్టి రోడ్లను చదును చేసుకుని పనులు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
మొబైల్ కనెక్టివిటీలో జాప్యంపై సిఎం అసహనం
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 01:55 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)