బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కోనసీమలో కూటమి గెలుపు

3 గంటల క్రితం

kutami
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 08:03 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - యంత్రాంగం : డాక్టర్‌ ‌బిఆర్‌ అంబేద్కర్‌ ‌కోనసీమ జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీల, ముమ్మిడివరం నగరం పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నెల 1న జరిగిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. వివరాలు ఇవి..

అమలాపురంలో కూటమి విజయం

అమలాపురం : ​అమలాపురం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. కూటమి జనసేన అభ్యర్థి నల్లా శ్రీధర్ 11,979 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక 36 వార్డులకు సంబంధించి విజయం సాధించిన కౌన్సిలర్ అభ్యర్థులు వరుసగా టిడిపి 18 వార్డులు, జనసేన 11 , బిజెపి 1 , వైసిపి 6 వార్డులు గెలుపొందారు.

​ కూటమి విజయోత్సవ సంబరాలు

అమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో పట్టణవ్యాప్తంగా విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాలతో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అముడా ఛైర్మన్ అల్లాడ స్వామి నాయుడు స్వగృహం వద్ద పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. బాణసంచా పేలుస్తూ, ఆనందోత్సాహాల మధ్య విజయోత్సవాలు జరుపుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయంతో అమలాపురం అభివృద్ధికి నూతన అధ్యాయం ప్రారంభమవుతుందని నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.

​ముమ్మిడివరం నగర పంచాయతీలో

పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాల్లో ముమ్మిడివరం నగర పంచాయతీ కూటమి జన సేన పార్టీ ఛైర్ పర్సన్ అభ్యర్ధి గుబ్బల గంగా రత్న భవాని సమీప ప్రత్యర్థి వైసిపి అభ్యర్ధిని సానబోయిన సునీలా దేవిపై 2,299 ఓట్ల మెజార్టీ తో విజయం సాధించారు.

అలాగే 23 కౌన్సిలర్లకు గాను టిడిపి నుంచి 15 మంది కౌన్సిలర్ల, జనసేన నుంచి ముగ్గురు, వైసిపి నుంచి అయిదుగురు గెలిచారు. వీరిలో 21 వార్డు నుంచి మొట్టమొదటిసారి పోటీ చేసిన నిమ్మకాయల విశ్వేశ్వరరావు 451 ఓట్లు సాధించి అత్యధిక మెజార్టీ సాధించగా,17 వార్డు నుంచి గెలుపొందిన వైసిపి అభ్యర్ధి పొనుగుమట్ల వెంకట సూర్యనారాయణ స్వల్ప మెజార్టీ 7 ఓట్లు తో గెలుపొందారు.

రామచంద్రపురం మున్సిపాలిటీలో రామచంద్రపురం మున్సిపాలిటీలో టిడిపి అభ్యర్థులు 14 వార్డులలో విజయం సాధించగా, జనసేన పార్టీ అభ్యర్థులు 12 వార్డులు దక్కించుకున్నారు. వైసిపి అభ్యర్థులు అన్ని వార్డులో పోటీ చేసినప్పటికీ 5 వార్డుల లో విజయం సాధించారు. కూటమి పొత్తులో భాగంగా బిజెపికి 1 వార్డు కేటాయించగా, కేవలం మూడు ఓట్లు తేడాతో బిజెపి అభ్యర్థి గెలుపొందాడు. దీంతో మొత్తం కూటమి (టిడిపి, జనసేన, బిజెపి) 27 వార్డులు కైవసం చేసుకోగా, వైసిపి 5 వార్డులకు పరిమితమైంది.

రామచంద్రపురం మున్సిపల్ ఛైర్మన్ గా మేడిశెట్టి శేషారావు

రామచంద్రపురం పురపాలక సంఘం ఎన్నికల్లో ఛైర్మన్ అభ్యర్థిగా టిడిపి నంచి మేడిశెట్టి శేషారావు విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి వైసిపి అభ్యర్థి అయిన చింతపల్లి నాగేశ్వరరావు పై 7378 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఆయన వైసిపి నుంచే కౌన్సిలర్ గా గెలుపొందారు. అయితే అప్పటి ఎన్నికల పొత్తుల్లో భాగంగా చైర్మన్ పదవి ఇస్తానని అప్పటి మంత్రి వేణు వాగ్దానం చేసి రెండున్నర సంవత్సరాల తర్వాత పదవి ఇవ్వకపోవడంతో కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి టిడిపిలో జాయిన్ అయ్యారు. ఈసారి మున్సిపల్ చైర్మన్ పదవి బిసి రిజర్వేషన్ కావడంతో తిరిగి టిడిపి తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆయన విజయం సాధించడం పట్ల రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇతర తెలుగుదేశం శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

సొంతవార్డుల్లో ప్రత్యర్ధులు గెలుపు

రామచంద్రపురం మున్సిపల్ ఎన్నికల్లో ఒక విచిత్రం జరిగింది. ఛైర్మన్ అభ్యర్థులు పోటీ చేసే సొంత వార్డుల్లో ప్రత్యర్థులు గెలిచి ఆశ్చర్యానికి గురి చేశారు. కూటమి టిడిపి అభ్యర్థి మేడిశెట్టి శేషారావు తన సొంత వార్డు అయిన ఆరో వార్డులో వైసిపి అభ్యర్థి చోడే భాను భాస్కర్ విజయం సాధించారు. అదేవిధంగా వైసిపి ఛైర్మన్ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరరావు సొంత వార్డు అయిన పదో వార్డులో టిడిపి అభ్యర్థి టేకుమూడి రామకృష్ణ గెలుపొందారు. పోటీలో ఉన్న చైర్మన్ అభ్యర్థులు సొంతవార్డుల్లో ప్రత్యర్ధులు గెలవడం హాట్ టాపిక్ గా మారింది. మిగిలిన 30 ఓట్లపై గురిపెట్టిన చైర్మన్ అభ్యర్థులు సొంతవార్డుల్లో పట్టు కోల్పోయారంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చోటు చేసుకున్న ఈ పరిణామం చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్