సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి
ప్రజాశక్తి - నరసాపురం : అర్నబ్ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులు, కౌలురైతులను ఆదుకునేందుకు తక్షణమే పంట నష్టం అంచనా వేసి ఎకరాకు రూ.20 వేలు పరిహారం ఇవ్వాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం మల్లవరంలంక, మల్లవరం గ్రామాల్లో తుపాను తీవ్రతకు దెబ్బతిన్న పంటలను ఆమె, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం గురువారం పరిశీలించారు. పంటనష్టం గురించి రైతులనడిగి తెలుకున్నారు. పంటంతా ఈనిక దశలో ఉండటంతో ఈ తుపాను వల్ల పంటంతా దెబ్బతింటుందని రైతులు నాయకుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు దాదాపు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టామని తెలిపారు. రమాదేవి, బలరాం మాట్లాడుతూ... కౌలు రైతులకు పంటనష్టం వారి పేరునే నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తక్షణమే గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరించాలని, మూడు రోజులుగా ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రజలను ఆదుకొనేందుకు 25 కేజీల బియ్యం, కందిపప్పు, మంచినూనె ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రామాంజనేయులు, రైతులు కె.శ్రీను, వై.బాలకృష్ణ, కె.ఏసు, కె.త్రిమూర్తులు, పి.కామేశ్వరరావు, కె.గోపాలకృష్ణ, కె.ఆంజనేయులు, సిహెచ్.పండు, సిహెచ్.నిర్మలరావు, వి.ఇజ్రాయెల్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)