- 28న ఢిల్లీ రాంలీలా మైదాన్‌లో సభ
- జగన్‌ను ఆహ్వానించిన అఖిల భారత కుల గణన సమన్వయ కమిటీ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కేంద్రం చేపడుతున్న కులగణనను సమగ్రంగా నిర్వహించడం ద్వారా బిసిలకు అన్యాయం జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత కుల గణన సమన్వయ కమిటీ ఈ నెల 28న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సంఘీభావం ప్రకటించాలని కమిటీ ప్రతినిధులు.. మాజీ సిఎం వైఎస్ జగన్‌కు బుధవారం విజ్ఞప్తి చేశారు. ‘చలో రాంలీలా మైదాన్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వ్యక్తిగతంగా హాజరుకావాలని కోరేందుకు కమిటీ ప్రతినిధులు వైసిపి కేంద్ర కార్యాలయంలో జగన్‌ను కలిశారు. వారిలో మండల్ కమిషన్ ఛైర్మన్‌గా పని చేసిన బిపి మండల్ మనవడైన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరజ్ మండల్, అఖిల భారత ఒబిసి విద్యార్థుల సంఘం జాతీయ అధ్యక్షులు గౌడ్ కిరణ్‌కుమార్, సకల్ ఒబిసి మహామోర్చా అధ్యక్షులు ఉమేష్ కుర్రం, పిట్టి మల్లికార్జున్‌యాదవ్‌తో పాటు, అఖిల భారత ఒబిసి విద్యార్థుల సంఘం నాయకులు రాకేష్ దత్తా, పెండెం జయంతి యాదవ్ రజనీకాంత్ తదితరులు ఉన్నారు. జగన్‌తో భేటీ అనంతరం సమన్వయ కమిటీ ప్రతినిధులు వైసిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిల డేటా లేకపోవడం వల్లే హైకోర్టు రిజర్వేషన్ పెంచేందుకు అనుమతినివ్వలేదని అన్నారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న భారీ సభకు వచ్చి అండగా నిలవాలని జగన్‌ను కోరామని, దానికి ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ సమావేశంలో వైసిపి రాష్ట్ర కన్వీనర్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)