ప్రజాశక్తి–రాజమహేంద్రవరం ప్రతినిధి : రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఖైదీలకు అందుతున్న వసతులు, వైద్య సేవలు, ఆహారం, న్యాయ సహాయం, వృత్తి నైపుణ్య శిక్షణ, వ్యవసాయ కార్యకలాపాలు, పునరావాస కార్యక్రమాలను బోర్డు ఆఫ్ విజిటర్స్ శనివారం సమగ్రంగా పరిశీలించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఏర్పాటు చేసిన బోర్డు ఆఫ్ విజిటర్స్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా ఆధ్వర్యంలో కేంద్ర కారాగారాన్ని సందర్శించింది. కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి.నరసింహ కిశోర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి, జైళ్ల శాఖ ఎస్పీ డాక్టర్ వి.సన్యాసిరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ పి.కోమలి తదితరులు పరిశీలనలో పాల్గొన్నారు. కారాగారంలోని వివిధ విభాగాలను బోర్డు సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఖైదీలకు కల్పిస్తున్న తాగునీరు, భోజనం, పారిశుధ్యం, వసతి, భద్రతా ఏర్పాట్లు, వైద్య సేవలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖైదీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు, అందుతున్న సదుపాయాలపై అభిప్రాయాలను సేకరించారు. ఖైదీలకు న్యాయ సహాయం అందుతున్న విధానాన్ని కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ కె.వి.రామారావు, జైలర్లు, డిప్యూటీ జైలర్లు, వైద్యాధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










కామెంట్లు (0)