బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనిడదవోలు కూటమిలో వైస్ చైర్మన్ చిచ్చు

26 నిమిషాల క్రితం

నిడదవోలు కూటమిలో వైస్ చైర్మన్ చిచ్చు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 11:29 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఒప్పందాన్ని కాదని జనసేన కౌన్సిలర్ పోటీ, గెలుపు

  • ఆమరణ దీక్షకు దిగుతానంటూ టిడిపి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి హెచ్చరిక

ప్రజాశక్తి - నిడదవోలు(తూర్పు గోదావరి) : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి వివాదం టిడిపి కూటమి పార్టీల మధ్య తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. పొత్తు ఒప్పందంలో భాగంగా టిడిపికి కేటాయించిన పదవిని జనసేన కౌన్సిలర్ దక్కించుకోవడంతో మొదలైన ఈ వివాదం, ఇప్పుడు అధిష్టానం జోక్యం, రాజీనామా డిమాండ్, నిరాహార దీక్ష హెచ్చరికల వరకు వెళ్లింది. కూటమి సర్దుబాటులో భాగంగా చైర్‌పర్సన్ పదవిని జనసేనకు, వైస్ చైర్మన్ పదవిని టిడిపికి కేటాయిస్తూ జనసేనకి చెందిన రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, టిడిపి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు సంయుక్తంగా ప్రకటించారు.

ముందస్తు ఒప్పందం ప్రకారం కూటమి అభ్యర్థిగా టిడిపికి చెందిన కొమ్మిన వెంకటేశ్వరరావు బరిలో నిలిచారు. అయితే, 4వ వార్డు జనసేన కౌన్సిలర్ తోపరాల కల్యాణ చక్రవర్తి అనూహ్యంగా పోటీకి దిగారు. చక్రవర్తి పేరును 8వ వార్డు కౌన్సిలర్ గంగుల వెంకటలక్ష్మి ప్రతిపాదించగా, 6వ వార్డు కౌన్సిలర్ సంజీవ్ బలపరిచారు. ఈ నేపథ్యంలో ఓటింగ్‌లో చక్రవర్తి 18 ఓట్లు వచ్చాయి. వెంకటేశ్వరరావుకు 13 మంది మాత్రమే మద్దతుగా చేతులెత్తారు. పార్టీ బి-ఫారం లేకపోవడంతో కల్యాణ చక్రవర్తి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించి జనసేన అభ్యర్థి పోటీ చేసి గెలవడంపై టిడిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంపై కార్యకర్తల సమావేశంలో టిడిపి నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మండిపడ్డారు. ఇది కూటమి ఒప్పందానికి విరుద్ధమన్నారు. పార్టీ అధిష్ఠానం తగిన నిర్ణయం తీసుకోకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని ఆయన హెచ్చరించారు.

మంత్రి దుర్గేష్‌కు ఇబ్బందికర పరిస్థితి

నిడదవోలు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కందుల దుర్గేష్.. ఈ వివాదంతో రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. టిడిపి అభ్యర్థికి మద్దతివ్వాలని తాను సూచించినప్పటికీ కౌన్సిలర్లు వినలేదని మంత్రి అధిష్ఠానానికి వివరించినట్లు సమాచారం. ఈ వ్యవ హారంపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రి దుర్గేష్ నుంచి వివరణ కోరినట్లు ప్రచారం జరుగుతుంది. జనసేన అధిష్టానం ఆదేశాల మేరకు వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని కల్యాణ చక్రవర్తికి సూచించినప్పటికీ, ఆయన అంగీకరించలేదని సమాచారం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్