మంగళవారం, 06 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తుది తీర్పునకు లోబడి డేటా సెంటర్‌ నిర్మాణం..

5 గంటల క్రితం

sa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 10:15 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- హైకోర్టు ఉత్తర్వులు

ప్రజాశక్తి-అమరావతి : విశాఖపట్నం గ్రామీణ మండలం అడవివరం, ముద్దరపాలెం గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న వైజాగ్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ప్రాజెక్టు నిర్మాణం తమ తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. సొంత రిస్క్‌తో ప్రాజెక్టు పనులు కొనసాగించుకోవచ్చని, పెట్టుబడులు పెట్టామన్న కారణంతో భవిష్యత్తులో ఎలాంటి హక్కులు కోరడానికి వీల్లేదని వైజాగ్‌ హైపర్‌ స్కేల్‌ డేటా పార్క్‌ లిమిటెడ్‌కు తేల్చి చెప్పింది. అన్ని చట్టపరమైన విధి విధానాలు, పర్యావరణ నిబంధనలు పాటిస్తూ నిర్మాణం చేపట్టాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు, అవసరమైన అనుమతులు లేనట్లు తేలితే ప్రాజెక్టులో జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తుది తీర్పు వెలువడితే దానికి కట్టుబడి ఉండాల్సిందేనని పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైజాగ్‌ హైపర్‌ స్కేల్‌ డేటా పార్క్‌ లిమిటెడ్‌ తదితరులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లీసా గిల్, జస్టిస్‌ చల్లా గుణ రంజన్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన 160 ఎకరాల భూములను డేటా సెంటర్‌ సంస్థకు కేటాయించడం చట్టవిరుద్ధమని, ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని జల్‌ విరాదరి జాతీయ కన్వీనర్‌ బొలిశెట్టి సత్యనారాయణ దాఖలు చేసిన పిల్‌పై బెంచ్‌ విచారణ చేపట్టింది. పర్యావరణ నిబంధనలు పాటించకపోవడం వల్ల భవిష్యత్తులో కలిగే దుష్ప్రభావాలపైనే ఆందోళన ఉందని పిటిషనర్‌ తరపున న్యాయవాది తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి కేవలం కిలోమీటరు దూరంలోనే ప్రాజెక్టు చేపడుతున్నారన్నారు. ప్రాజెక్టు ‘ఎ’ కేటగిరికి చెందినదని, కేంద్ర అనుమతి తప్పనిసరని వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎజి దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదిస్తూ, రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ జూన్‌ 10న పర్యావరణ అనుమతులిచ్చిందన్నారు. ప్రాజెక్టు ‘బి’ కేటగిరికి చెందినదైనందున కేంద్ర అనుమతులు అవసరం లేదన్నారు. సంస్థ తరపున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ వాదిస్తూ, డేటా సెంటర్‌ ఏర్పాటుకు ప్రత్యేక పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ రాజ్యసభలో ప్రకటించిందన్నారు. ​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్