- విఐపి బ్రేక్ దర్శనానికి మార్పులు
- సెప్టెంబర్ హుండీ ఆదాయం రూ.140 కోట్లు
ప్రజాశక్తి - తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 4, 5 తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించి మార్పులు చేసింది. అక్టోబర్ 4న విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించి సిఫార్సు లేఖలను టిటిడి స్వీకరించదు. దీంతో, ఆ రోజు సిఫార్సు లేఖల ద్వారా విఐపి బ్రేక్ దర్శనం పొందే అవకాశం ఉండదు. అక్టోబర్ ఐదు, 2026న విఐపి బ్రేక్ దర్శనాన్ని పూర్తిగా రద్దు చేశారు. అయితే ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే విఐపిలకు మాత్రం ఈ నిర్ణయం వర్తించదు. భారీగా యాత్రికుల రద్దీ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దర్శనానికి వచ్చే యాత్రికులు ఈ మార్పులను ముందుగానే గమనించాలని టిటిడి సూచించింది. శ్రీవారి దర్శనం కోసం యాత్రికులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం సర్వదర్శనానికి 30 నుంచి 35 గంటలకు పైగా సమయం పడుతోంది. దర్శనానికి వచ్చే యాత్రికులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి రావడంతో ముందుగానే అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని టిటిడి అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులతో కలిసి తిరుమలకు వచ్చే వారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ సమయం క్యూలైన్లలో ఉండాల్సి రావచ్చు కాబట్టి అవసరమైన మందులు వెంట తీసుకెళ్లడం మంచిదని, తాగునీటిని అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
గత నాలుగు రోజుల్లో యాత్రికుల సంఖ్య...
సెప్టెంబర్ 28న 84,171 మంది, 29న 77,082 మంది, 30న 78,723 మంది, అక్టోబర్ 1న 78,026 మంది యాత్రికులు దర్శించుకున్నారు. సెప్టెంబర్ నెల కూడా తిరుమల శ్రీవారి హుండీ 140 కోట్లు దాటిందని అధికారులు తెలిపారు.








కామెంట్‌లు (0)