ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్ చామకూరి
ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్ : ఎన్నికల సమయంలో ఎలాంటి అక్రమ మద్యం కార్యకలాపాలకు తావు లేకుండా నిరంతరం నిఘా ఉంచాలని రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టర్ సమావేశ మందిరంలో బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ చామకూరి, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ.. ప్రకాశం, మార్కాపురం, బాపట్ల జిల్లాలకు సంబంధించి నేరాల నియంత్రణ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ... అక్రమంగా తయారు చేస్తున్న నాటుసారా, డ్యూటీ చెల్లించని మద్యం, కల్తీ మద్యం తయారీ, రవాణా, విక్రయాలను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అక్రమ మద్యం కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ మాట్లాడుతూ.. అక్రమ కల్తీ మద్యంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఫిర్యాదులు చేసేందుకు సులభంగా అందుబాటులో ఉండేలా 14405 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌ను మద్యం దుకాణాల్లో స్పష్టంగా కనిపించే ప్రదేశాల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. అనంతరం, అధికారులు ఒంగోలులోని ఎపి ఎస్బిసిఎల్ డిపోను సందర్శించి, మద్యం నిల్వలు, సరఫరా వ్యవస్థపై అవసరమైన సూచనలు జారీ చేశారు. తదుపరి ఒంగోలులోని ఎంపి వైన్స్‌ను తనిఖీ చేసి, ఎపి ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా ప్రతి మద్యం సీసాను తప్పనిసరిగా స్కాన్ చేస్తూ వంద శాతం స్కానింగ్ లక్ష్యాన్ని సాధించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు అసిస్టెంట్ కమిషనర్ విజయ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి ఎస్ ఆయేషా బేగం, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)