75వ దినోత్సవం, వజ్రోత్సవం ముగింపులో గవర్నరు నజీర్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్’ సంస్థ దేశ నిర్మాణానికి గణనీయమైన కృషి చేసిందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 75వ వ్యవస్థాపక దినోత్సవం, అసోసియేషన్ వజ్రోత్సవ ముగింపు వేడుకలు విజయవాడలోని లోక్‌భవన్‌లో శనివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అక్షరాస్యత, నీరు, పారిశుధ్యం, ఆరోగ్యం, పరిశుభ్రత, ప్లాస్టిక్ నిర్మూలన, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొనేలా యువతకు స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ శిక్షణ ఇస్తోందన్నారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని, వాతావరణ పరిరక్షిణ, ప్రతిఒక్కరి జీవితాలను, అవకాశాలను మెరుగుపరచడం వంటి లక్ష్యాలను సాధిస్తోందన్నారు. రాష్ట్రంలో 4,400 స్కౌట్, గైడ్ యూనిట్లు పనిచేస్తుండగా వాటిలో 2,342 స్కౌట్ యూనిట్లు, 2,058 గైడ్ యూనిట్లు ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ తమీమ్ అన్సారియా ఎ, ఆంధ్రప్రదేశ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ అధికారులు, గవర్నర్ జాయింట్ సెక్రటరీ పిఎస్ సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా గవర్నర్.. సీనియర్ స్కౌట్ మాస్టర్లను, గైడ్ కెప్టెన్లను సత్కరించారు. అంకితభావం, కృషికి గుర్తింపుగా అందించే ప్రతిష్టాత్మక రాజ్యపురస్కార్ సర్టిఫికెట్లకు ఎంపికైన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బాలురు, బాలికలను అభినందించారు.








కామెంట్‌లు (0)