ప్రజాశక్తి - గోస్పాడు : ఆన్‌లైన్ గేమ్‌కు బానిసై చేసిన అప్పులు తీర్చలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన నంద్యాల జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. ఎఎస్‌ఐ మద్దిలేటి కథనం ప్రకారం... కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తికి చెందిన అంజితకు గోస్పాడు మండలం సాంబవరం గ్రామానికి చెందిన మేకల శేషాద్రికి ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐదేళ్ల కుమారుడు వెంకట మహేంద్ర, మూడేళ్ల కుమార్తె మోక్ష ఉన్నారు. మేకల శేషాద్రి నూనెపల్లిలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నారు. ఆన్‌లైన్ గేమ్‌కు బానిసై ఆయన అప్పులు చేశారు. దీంతో, శేషాద్రి తండ్రి, మామ ఆర్థిక సాయం చేశారు. బంగారాన్ని సైతం బ్యాంకులో తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుతో అప్పులు తీర్చారు. అప్పులు పూర్తిగా తీర్చలేకపోవడంతో పాటు, బంగారు తాకట్టు పెట్టిన సమయం కూడా ముగుస్తుండటంతో తీవ్ర మనస్థాపానికి గురైన దంపతులు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య పాల్పడ్డారు. ఉదయం ఎనిమిది గంటలు దాటినా ఇంటి తలుపులు తెరవపోవడంతో ఇంటి పక్కనున్న మేకల రమాదేవి కిటికీలో నుంచి చూసి మృతుడి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. దంపతులిద్దరూ విగతజీవులుగా పడి ఉండటంతో శేషాద్రి తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి మూరబోయిన గురవయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌ఛార్జి ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి తెలిపారు.
ఆన్‌లైన్ గేమ్‌తో అప్పుల పాలై దంపతుల ఆత్మహత్య
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 08:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)