- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కోటి రూపాయలు కేటాయిస్తూ ప్రణాళిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నిధులు కేటాయించింది. దీంతో మొత్తం రూ.175 కోట్లతో స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన మార్గ దర్శకాలు కూడా విడుదలయ్యాయి. నిధుల వినియోగంలో ఎమ్మెల్యేల సిఫార్సులకు ప్రాధాన్యం ఇవ్వాలని, నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనులను ఎమ్మెల్యేలు సూచించవచ్చునని, జిల్లా కలెక్టర్ వాటిని పరిశీలించి ఆమోదం తెలుపుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రధానంగా తాగునీరు, గ్రామీణ రహదారులు, డ్రైనేజీ, చెరువుల అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రజా మరుగుదొడ్లు, కమ్యూనిటీ భవనాలు, వీధి దీపాలు వంటి పనులు చేపట్టవచ్చని పేర్కొన్నారు. అయితే మతపరమైన పనులు, ప్రైవేటు భూముల్లో పనులు, ఇప్పటికే ఇతర పథకాల కింద మంజూరైన పనులు, జీతాలు, సాధారణ నిర్వహణ ఖర్చులకు ఈ నిధులను వినియోగించరాదని స్పష్టం చేసారు. శాసనసభ్యుని నుంచి పూర్తి ప్రతిపాదన అందిన 30 రోజుల్లోగా పరిపాలనా అనుమతులు ఇవ్వాలని పేర్కొన్నారు. ఇలా అనుమతి ఇచ్చిన పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. ప్రతి నెలా ఐదో తేదీలోపు పనుల పురోగతి నివేదికలు సమర్పించాలని, ఈ పనులను జిల్లా అధికారులు కనీసం 10 శాతం, రాష్ట్ర స్థాయి అధి కారులు ఐదు శాతం తనిఖీ చేయాలని పేర్కాన్నారు. ఎస్.సి నియోజకవర్గాల్లో ఖర్చు మొత్తాన్ని ఎస్సి కాంపోనెంట్గా, గిరిజన నియోజకవర్గాల్లో ఖర్చు మొత్తాన్ని ఎస్టి కాంపోనెంట్గా పరిగణిస్తారని, ఇతర నియోజకవర్గాల్లో ఎస్సీ కాంపోనెంట్కు 17.08 శాతం, ఎస్టీ కాంపోనెంట్కు 5.53 శాతం కేటాయింపులు వర్తిస్తాయని ఉత్తర్వులలో తెలిపారు.








కామెంట్లు (0)