- తీవ్ర వాయుగుండంగా రూపాంతరం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఏర్పడిన ‘అక్వాన్’ తుపాను శుక్రవారం ఉదయం గోపాలపూర్ సమీపంలో తీరం దాటింది. శుక్రవారం ఉదయం 7.30 నుంచి 8.30 గంటల మధ్య ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీర ప్రాంతాన్ని దాటినట్లు భాతర వాతావరణ సంస్థ వెల్లడించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు నమోదయ్యాయని తెలిపింది. తుపాను గంటకు 26 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా పయనించి.. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలహీనపడినట్లు పేర్కొంది. ఆ తర్వాత వాయుగుండంగా బలహీనపడుతుందని వెల్లడించింది. దీని ఫలితంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.








కామెంట్లు (0)