మంగళవారం, 20 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Cyclone - ఎపి కి తుపాను ముప్పు ..!

11 గంటల క్రితం

Cyclone threat for AP..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 12:12 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రాథమికంగా హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఫలితంగా రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.


ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రాబోయే రోజుల్లో మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది. పలు వాతావరణ మోడళ్ల అంచనా ప్రకారం .... ఈ నెల 24, 25 తేదీల్లో అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది మరింత బలపడుతూ సముద్రంలో ముందుకు సాగుతుంది. ఈ నెల 27వ తేదీ నాటికి ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం ఆ వాయుగుండం క్రమంగా మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.


మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిన తర్వాత వాయుగుండం మరింత తీవ్ర రూపం దాల్చనుంది. ఆ తర్వాత కేవలం రెండు రోజుల్లోనే ఇది పూర్తిస్థాయి తుపానుగా మారే ప్రమాదం ఉందని వాతావరణ మోడళ్లు హెచ్చరిస్తున్నాయి. ఈ నెలాఖరు నాటికి ఈ తుపాను ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. అయితే, ఈ అల్పపీడన ఏర్పాటు, తుపాను గమనం, దాని తీవ్రతపై మరో రెండు రోజుల్లో మరింత స్పష్టత రానుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్