సంఘ్ భావజాలంపై ప్రతిపక్ష నేత విమర్శలు
సమానత్వం కోసమే తమ పోరాటమని వ్యాఖ్య
న్యూఢిల్లీ: మహిళలను పురుషుల ఆస్తిగా భావించే సంకుచిత ధోరణి ఆర్‌ఎస్‌ఎస్‌కు ఉందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం, కార్యాచరణపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళల పట్ల వివక్ష చూపే ఆలోచనా ధోరణికి వ్యతిరేకంగానే తమ పోరాటమని స్పష్టం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రాహుల్ గాంధీ స్పందిస్తూ.. “ఆర్‌ఎస్‌ఎస్ పురుషులతో కూడిన రాజ్యాంగ విరుద్ధమైన కూటమి. మహిళలు పురుషుల ఆస్తి అని అది భావిస్తుంది” అని వ్యాఖ్యానించారు. తాను శివశక్తిని విశ్వసిస్తానని, అందుకే ఆర్‌ఎస్‌ఎస్‌తో పోరాడటంలో ఆనందం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ పోరాటం సమానత్వం, సూత్రాలకు సంబంధించినదని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో సంబంధం ఉన్న పలువురు మహిళలు సైతం తన పోరాటానికి మద్దతు ఇస్తున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సంఘ్‌కు చెందిన మహిళలు తనతో కలిసి రావడం సంతోషకరమని వ్యాఖ్యానించారు.
కాగా, ఆర్‌ఎస్‌ఎస్ ఇటీవల వందేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నాగ్‌పూర్‌లో నిర్వహించిన విజయదశమి ఉత్సవం, శస్త్రపూజ కార్యక్రమంలో సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగించారు. భారతదేశ గుర్తింపు, సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా దేశాన్ని సంఘటితం చేసి బలోపేతం చేసేందుకు గత వందేళ్లుగా కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు పలు కీలక అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.





కామెంట్‌లు (0)