రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఢిల్లీరావు
ప్రజాశక్తి -అమరావతి బ్యూరో: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో తక్కువ స్థాయిలో ఉందని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కు కల్పించేలా తక్షణ చర్యలు చేపట్టాలని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణకు శుక్రవారంతో గడువు ముగియనుందని తెలిపారు. 2021లో ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదైన ఓటర్ల సంఖ్యతో ప్రస్తుత నమోదు వివరాలను పోల్చి చూస్తే ఈసారి నమోదు తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ నెల 25న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించాల్సి ఉన్నందున ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆఫ్‌లైన్‌లో అందిన దరఖాస్తుల డిజిటలైజేషన్, విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.








కామెంట్‌లు (0)