డిప్యూటీ సిఎం పవన్, పలువురు మంత్రుల సమీక్షలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: అర్నబ్ అతి తీవ్ర తుపాను ముప్పు నేపథ్యంలో ప్రజల ప్రాణ రక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని అధికారులను డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు వివిధ శాఖల అధికారులతో డిప్యూటీ సిఎం, పలువురు మంత్రులు వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. కాకినాడ జిల్లాలో తుపాను సన్నద్ధతపై సమీక్షించి 92 ఆవాసాల నుంచి 15 వేల మందికి పైగా ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పవన్ తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. ఏలేరు వరద ప్రవాహంపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ఆరు వేల మంది సిబ్బందిని సిద్ధం చేసినట్లు ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఫిర్యాదుల కోసం 1912 కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. తెగిపడిన విద్యుత్ తీగలు, కండక్టర్లను చేతితో తాకొద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు, పంటలు, పశుసంపద, ప్రజల ఆస్తులకు నష్టం తగ్గించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. అవసరమైనచోట సహాయక చర్యలు వేగంగా చేపట్టేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుపాన్‌ను ఎదుర్కొనేందుకు రెవెన్యూ యంత్రాంగం సర్వసిద్ధంగా ఉందని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. ఉద్యోగులు, అధికారులకు సెలవులు రద్దు చేశామన్నారు. బిసి హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని, వారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని బిసి, ఇడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. విద్యార్థులకు తాజా ఆహారం, వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే అందజేయాలన్నారు. వైద్య సేవల కోసం 1,050 బృందాలు, 8,441 అత్యవసర పడకలు సిద్ధం చేసినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యంగా పాముకాటు ఘటనలను దృష్టిలో పెట్టుకుని 26,500 ఎవిఎస్ ఇంజక్షన్లు సిద్ధం చేశామన్నారు.








కామెంట్‌లు (0)