- పలు కాలనీలు, ప్రధాన రహదారులపైకి వరద నీరు.. ఇళ్లలోకి చేరిన నీరు
- డ్రైనేజీల అనుసంధానం లేకపోవడం, కాలువలపై ఆక్రమణలతో ముంపు తీవ్రం
- ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే మద్దిపేట వెంకటరాజు
ప్రజాశక్తి-దేవరపల్లి: భారీ వర్షాలతో తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంబేడ్కర్ కాలనీ, బాబు జగజ్జీవన్ రామ్ ప్రాంతం, ఎస్సీ పేటతో పాటు జాజంపూడి, యాదవోలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఇళ్లలోకి, ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థలో లోపాలు, కాలువల అనుసంధానం లేకపోవడం, ప్రధాన కాలువలపై అక్రమ నిర్మాణాలే ముంపు సమస్యకు ప్రధాన కారణాలుగా స్థానికులు పేర్కొంటున్నారు.
భారీ వర్షాలకు అంబేడ్కర్ కాలనీ ముంపునకు గురైంది. కాలనీలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో రాకపోకలు సాగించలేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. గతంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన డ్రైనేజీ కాలువను మంజూరైన వెడల్పు కంటే తక్కువగా నిర్మించారని ఆరోపిస్తున్నారు. సరైన ప్రణాళిక లేకపోవడంతో నీరు సాఫీగా వెళ్లక ఇళ్ల వద్ద నిలుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేవరపల్లిలో కురిసిన భారీ వర్షాలకు జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది. డ్రైనేజీ కాలువలు ఆక్రమణలకు గురికావడంతో నీరు వెళ్లే మార్గం లేక రహదారిపై ప్రవహించిందని స్థానికులు తెలిపారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. అధికారులు స్పందించి కాలువలపై ఆక్రమణలను తొలగించి వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అర్ధరాత్రి కురిసిన వర్షానికి బాబు జగజ్జీవన్ రామ్ ప్రాంతంలోని రహదారులపై వరద నీరు నదిని తలపించేలా ప్రవహించింది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఈ ప్రాంతం తరచూ ముంపునకు గురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డ్రైనేజీ కాలువలు నిర్మించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
దేవరపల్లి ఎస్సీ పేటలోని శ్మశానవాటికలోకి పొలాల నుంచి వచ్చిన భారీ వర్షపు నీరు చేరింది. నీరు బయటకు వెళ్లే మార్గం లేక కాలనీ వైపు ప్రవహిస్తోందని స్థానికులు తెలిపారు. సమాధులు దెబ్బతినడంతో పాటు చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మారుతీనగర్ డ్రైనేజీకి అనుసంధానం కల్పించి ముంపు సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
దేవరపల్లి మండలంలోని త్యాజంపూడి, యాదవోలు గ్రామాల్లో భారీ వర్షాలకు వాగులు ఉద్ధృతంగా ప్రవహించాయి. రెండు గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. యాదవోలులో రహదారిపై సుమారు రెండడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో సమీప ఇళ్లను నీరు చుట్టుముట్టింది. రోడ్లు జలమయమై రాకపోకలు సాగించలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
డ్రైనేజీల అనుసంధానం లేకపోవడమే ప్రధాన సమస్య
కొత్తగా డ్రైనేజీ కాలువల నిర్మాణాలు చేపట్టినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కాలువలు పరస్పరం అనుసంధానం కాకపోవడం, నీరు వెళ్లే మార్గాల్లో సరైన కనెక్టివిటీ లేకపోవడంతో వరద నీరు ఇళ్లలోకి, రహదారులపైకి ప్రవహిస్తోంది. దేవరపల్లి శివారు ప్రాంతాల నుంచి వచ్చిన నీరు ప్రధాన ప్రవాహ మార్గాల్లోకి చేరి, అక్కడి నుంచి వెళ్లే మార్గం లేక రహదారులపైకి చేరుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.
ప్రధాన రహదారుల వెంబడి ఉన్న డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాలు కూడా నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఎన్ని కొత్త డ్రైనేజీలు నిర్మించినా వాటికి సరైన అనుసంధానం, నీరు వెళ్లే సహజ మార్గాలు లేకపోతే ప్రయోజనం ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సమగ్ర డ్రైనేజీ ప్రణాళిక రూపొందించి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే
దేవరపల్లిలోని ముంపు ప్రాంతాల్లో వరద పరిస్థితిని గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపేట వెంకటరాజు పరిశీలించారు. బాధిత ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులను తక్షణమే సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాలన్నింటినీ పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టేలా సిబ్బందిని అప్రమత్తం చేశారు. వర్షాలు కురిసిన ప్రతిసారీ ఇదే పరిస్థితి ఎదురవుతోందని, తాత్కాలిక చర్యలతో కాకుండా డ్రైనేజీ వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేసి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని దేవరపల్లి ప్రజలు కోరుతున్నారు.







కామెంట్లు (0)