మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

జోన్‌-2లోకి పోలవరం

13 గంటల క్రితం

girijana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 10:34 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- సమీక్షలో సిఎం చంద్రబాబు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్‌ 1లోకి మార్చాలని, పోలవరం జిల్లాను జోన్ 2లో చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ఆ శాఖ అధికారులతో రాష్ట్ర సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

గిరిజన ప్రాంతాల్లో స్థానికులకే ఉద్యోగాలతోపాటు పలు సమస్యలపై గిరిజన సంఘాలతో వెంటనే చర్చించాలని ఆదేశించారు. ఆయా అంశాలపై గిరిజన సంఘాలను ఆహ్వానించి, ఉన్నతాధికారులు, గిరిజన ప్రజా ప్రతినిధులు చర్చించాలని సూచించారు. జిఓ 3 ప్రయోజనాలు దక్కేలా చేస్తున్న ప్రయత్నాలను వివరించడంతో పాటు ఈ ప్రక్రియలో వారిని భాగస్వాములు చేయాలని సూచించారు.

చట్టపరమైన అడ్డంకులు అధిగమించడానికి గిరిజన సంఘాల సూచనలు తీసుకోవాలన్నారు. బాక్సైట్ మైనింగ్ విషయంలో ఆందోళన చెందొద్దని, గిరిజనుల హక్కులకు, మనోభావాలకు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలూ ఉండవన్నారు. అలాగే 1/70 చట్టం అమలు విషయంలో అనుమానాలు అవసరం లేదని, ఇదే విషయాన్ని గిరిజన సంఘాలకు చెప్పాలని సూచించారు. అరకు కాఫీని ప్రమోట్ చేసినా, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, రవాణా సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసినా అది కూటమి ప్రభుత్వం గిరిజనులపై చూపిన బాధ్యత అని వెల్లడించారు. గిరిజన సంఘాలతో చర్చలకు, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో చొరవ తీసుకోవాలని గిరిజన ప్రజా ప్రతినిధులకు, గిరిజన సంక్షేమశాఖ అధికారులకు సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2000 సంవత్సరంలో జిఓ 3 తీసుకొచ్చామన్నారు. దీని ద్వారా షెడ్యూల్ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే వంద శాతం రిజర్వేషన్లు దక్కేలా చూశామని, దాదాపు 20 ఏళ్లు అమల్లో ఉన్న ఈ ఉత్తర్వును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. నాటి ప్రభుత్వం ఈ అంశంపై బలమైన వాదనలు వినిపించకపోవడం వల్ల సుప్రీంకోర్టు 2020 ఏప్రిల్ 22న కొట్టేసిందన్నారు. ఈ ప్రయోజనాలను కల్పించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు. సమీక్షలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్