సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వెలిగొండపై టిడిపి అబద్దపు ప్రచారం

2 గంటల క్రితం

appi reddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 07:28 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- వైసిపి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సుధాకరబాబు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వెలిగొండ ప్రాజెక్టుపై టిడిపి నేతలు, చంద్రబాబు చేస్తున్నదంతా పచ్చి అబద్ధపు ప్రచారమని, 1996లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు, తన ఎనమిదేళ్ల పాలనలో ప్రాజెక్టు పనులను ఏమాత్రం పట్టించుకోలేదని వైసిపి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టి,జె.ఆర్‌.సుధాకరబాబు విమర్శించారు. సోమవారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ జలయజ్ఞం కింద కోట్లాది రూపాయలు వెచ్చించి, 20 కిలోమీటర్లకు పైగా టన్నెల్ తవ్వకాలు పూర్తి చేశారని తెలిపారు. చంద్రబాబు తన హయాంలో రెండు టన్నెల్స్ కలిపి తవ్వించింది కేవలం 6.68 కిలోమీటర్లు మాత్రమేనని అన్నారు. జగన్ హయాంలోనే 10.56 కిలోమీటర్ల టన్నెల్ పనులు పూర్తి చేసి, 2024 మార్చిలోనే జాతికి అంకితం చేశారని తెలిపారు. ఇతరులు చేసిన పనులకు క్రెడిట్ చోరీ చేయడం, గోబెల్స్ ప్రచారం చేసుకోవడం టిడిపికి అలవాటుగా మారిందని అన్నారు. గడిచిన 27 నెలల కూటమి పాలనలో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం, పునరావాసం ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. మొత్తం 37 కిలోమీటర్ల టన్నెల్‌లో వైఎస్సార్, జగన్ కలిపి 30 కిలోమీటర్లకు పైగా పూర్తి చేస్తే, బాబు చేసిందేమిటో చెప్పాలన్నారు. జగన్‌పై ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి చేసిన అనుచిత, దిగజారుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వైఎస్సార్, జగన్ దయతో ఎంపి అయిన మాగుంట చంద్రబాబు ప్రాపకం కోసం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. 2024 మార్చిలో వైఎస్ జగన్ రెండు టన్నెళ్లను పూర్తి చేసి జాతికి అంకితం చేసిన సభలో మాగుంట స్వయంగా పాల్గొన్నారని, ఢిల్లీ లిక్కర్ కేసు భయంతోనే మాగుంట కుటుంబం అవకాశవాద రాజకీయాలు చేస్తూ పార్టీ మారిందని అన్నారు. వైఎస్సార్‌సీపీని అప్రజాస్వామిక భాషలో దూషిస్తే అదే స్థాయిలో సమాధానం చెప్పే శక్తి తమకుందని, పదవుల కోసం గాలివాటం రాజకీయాలు చేసేవాళ్లం కాదని, పార్టీ జెండా భుజాన మోసి పోరాడే కార్యకర్తలమని అన్నారు. 1996 నుంచి 2004 వరకు సిఎంగా ఉన్న చంద్రబాబు, వెలిగొండ శంకుస్థాపన సభలో డయాస్, మైకుల కోసమే రూ. 11 లక్షలు ఖర్చు చేశారని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు చంద్రబాబు ఎంత ఖర్చు చేశారో దమ్ముంటే లెక్కలు బయటపెట్టాలని కోరారు. చంద్రబాబు వెలిగొండ వద్ద సాష్టాంగ నమస్కారాల డ్రామాలు ఆపి, ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం, ఇళ్లను తక్షణమే అందించాలని అన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్