- రైతు, ప్రజాసంఘాల నాయకుల గృహ నిర్బంధంపై ఎపి రైతు సంఘం ఆగ్రహం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వెలిగొండ ప్రాజెక్టు కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న రైతు, ప్రజాసంఘాల నాయకులను పోలీసులు అక్రమంగా గృహ నిర్బంధం చేయడాన్ని ఎపి రైతు సంఘం ఖండించింది. వెలిగొండ ప్రాజెక్టులో భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయమైన పరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తున్న నాయకులను అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభోత్సవానికి సిఎం చంద్రబాబునాయుడు సోమవారం మార్కాపురం జిల్లా దోర్నాలకు వస్తున్న నేపథ్యంలో రైతు, ప్రజాసంఘాల నాయకులను ముందస్తుగా గృహ నిర్బంధం చేయడాన్ని తప్పుపట్టారు. నిర్వాసితుల న్యాయం కోసం పోరాడుతున్న నిర్వాసితుల సంఘం నాయకులు గాలి వెంకట్రామిరెడ్డి, సోమయ్య, బాలనాగయ్య, రఫీ, విజయకుమార్ తదితరులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. దశాబ్దాలుగా వెలిగొండ ప్రాజెక్టు కోసం ఉద్యమించిన నాయకులను అరెస్టు చేసి, వారి గొంతు నొక్కితే తప్ప మార్కాపురం జిల్లాలో పర్యటించే ధైర్యం ముఖ్యమంత్రికి లేదా? ప్రశ్నించారు. ‘ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది మేమే.. ప్రారంభం చేసేది మేమే’ అంటూ గొప్పలు చెప్పుకోవడం కాదని, ప్రాజెక్టు కోసం సర్వస్వం కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం చేయడంలో చిత్తశుద్ధి చూపాలని డిమాండ్ చేశారు. సిఎంకు చిత్తశుద్ధి ఉంటే నిర్వాసితులందరికీ న్యాయమైన పరిహారం, పునరావాసం కల్పించి, సంతోషంగా గ్రామాలను ఖాళీ చేసే పరిస్థితి కల్పించాలని కోరారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని అడుగుతున్న నాయకులంటే ప్రభుత్వానికి ఎందుకంత భయమని ప్రశ్నించారు.2026 ఆగస్టు 31ను కటాఫ్ తేదీగా నిర్ణయించి, 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరినీ అర్హులుగా గుర్తించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా కేవలం రూ.2 లక్షలు ఇచ్చి అదే గొప్ప పరిహారంగా ప్రచారం చేసుకోవడం నిర్వాసితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం తొలి దశతోనే ఆగిపోకుండా రిజర్వాయర్‌ను పూర్తి సామర్థ్యంతో వినియోగంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించేలా అవసరమైన కాలువల నిర్మాణానికి ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నాలుగు లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు, సుమారు 15 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించే లక్ష్యాన్ని ప్రభుత్వం పూర్తి చేయాలని స్పష్టం చేశారు.








కామెంట్‌లు (0)