- ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో వచ్చేది కాదు
- విజయవాడలో వచ్చే ఏడాది జనవరిలో ఐలూ జాతీయ సహాసభలు
- జాతీయ జుడిషియల్ అకాడమీ మాజీ డైరెక్టర్ జి మోహన్ గోపాల్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం 'అసమ్మతి' అనేది రాజ్యాంగం ప్రసాదించిన హక్కుని, అది ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో ఇచ్చేది కాదని జాతీయ జుడిషియల్ అకాడమీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ జి మోహన్ గోపాల్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండేలా చేసే అత్యంత కీలకమైన రాజ్యాంగ సాధనం అసమ్మతి అని పేర్కొన్నారు .శనివారం విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) రాష్ట్ర స్ధాయి సెమినార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు అధ్యక్షతన నిర్వహించారు. ఐలు జాతీయ మహాసభలు 2027 జనవరి నెలలో విజయవాడలో నిర్వహించనున్న సందర్భంగా ఈ రాష్ట్ర స్థాయి సెమినార్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భిన్నాభిప్రాయాలను అణచివేయడం ప్రజాస్వామ్యాన్ని మెజారిటేరియన్ పాలనగా మార్చేస్తుందని, ఇది అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. క్రిమినల్, భద్రతా చట్టాలను నిర్మాణాత్మక ప్రజాస్వామిక విమర్శలను అణచివేయడానికి ప్రభుత్వాలు దుర్వినియోగం చేయడం అత్యంత విషాదకరమన్నారు. న్యాయస్థానాల్లో విచారణ ముగియకుండానే, విలేకరులను హక్కుల కార్యకర్తలను, అసమ్మతివాదులను సుదీర్ఘ కాలం పాటు అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉంచడం, బెయిల్ నిరాకరించడం వంటి ప్రభుత్వ ప్రతీకార చర్యలకు భయపడి, పౌర సమాజం, విద్యావేత్తలు, మేధావులు, కార్మిక సంఘాలు అసమ్మతి తెలిపే విషయంలో స్వీయనియంత్రణ పాటించేలా ప్రభుత్వాలు భయాందోళనలు సృష్టించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని అన్నారు. న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ పరిరక్షణ సంస్థలు మెజారిటీ ప్రభుత్వ నిర్ణయాలను నిలువరించే స్వతంత్ర రక్షణ కవచాలుగా కాకుండా, ప్రభుత్వానికి దాసోహమవ్వడం దురదృష్టకరమని పేర్కొన్నారు. న్యాయస్థానాలు ప్రభుత్వ వాదనను గుడ్డిగా నమ్మడం,పౌరస్వేచ్ఛ కంటే రాజ్య సౌలభ్యానికే ప్రాధాన్యత ఇవ్వడం మాని ప్రభుత్వ చర్యలను రాజ్య మౌలిక విలువల గీటురాయి పై నిరంతరం పరీక్షించే బాధ్యతను న్యాయవాదులు తీసుకోవాలని పిలుపునిచ్చారు. సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం మనలేదన్న బిఆర్అంబేద్కర్ ప్రాథమిక సూత్రాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. సాంప్రదాయ ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా బహుజనులు, శ్రామిక వర్గాలు, మైనారిటీలు,ఇతర అణగారిన వర్గాలు తమ హక్కుల కోసం గళమెత్తినప్పుడు వారి అసమ్మతిని తీవ్రంగా అణచివేస్తున్నారని విమర్శించారు. సమాజంలో అణగదొక్కబడుతున్న వర్గాలకు అండగా నిలబడి, రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను కాపాడటానికి న్యాయస్థానాల్లో న్యాయవాదులు సామాజిక బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఐలూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరి నెలలో ఐలు జాతీయ మహాసభలను విజయవాడలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ జాతీయ మహాసభలు విజయవంతానికి అందరూ కృషి చేయాలన్నారు. రాబోయే ఐలూ జాతీయ మహాసభల జయప్రదానికి సీనియర్ న్యాయవాదులు, న్యాయ కోవిదులు, నగర ప్రముఖులతో కూడిన ఒక ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఈ సెమినార్ లో న్యాయవాదుల సమక్షంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఐలూ జాతీయ సభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులు వికాస్ రంజన్ భట్టాచార్య, ఐలూ జాతీయ ప్రధాన కార్యదర్శి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పివి సురేంద్రనాథ్, ఎపి బార్ కౌన్సిల్ సభ్యులు సత్తు అంకయ్య, ఆర్ గంగాభవాని, ఐలూ జాతీయ ఉపాధ్యక్షులు కె ఇలంగో, కొల్లి సత్యనారాయణ, విజయవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి లక్ష్మీనారాయణ, ఐలూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కె పార్థసారథి, ఐలూ తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు ఎం శ్రీనివాసరావు, విట్ యూనివర్సిటీ డీన్ చెక్కా బెనర్జీ, ఐలూ రాష్ట్ర కార్యదర్శి నర్రా శ్రీనివాస రావు మాట్లాడారు. ఈ రాష్ట్ర స్థాయి సెమినార్ లో ఐలూ రాష్ట్ర కోశాధికారి సప్పా రమేష్ బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చేము కోటేశ్వరరావు, వి రాజారత్నం, వై రమేష్, కె మునిస్వామి, మేక ఈశ్వరయ్య, బివి రమణారెడ్డి, బి వి రామాంజనేయరావు, ఎస్ వెంకటేశ్వరరావు, పివిపి లక్ష్మి, నాగజ్యోతి, భాష్యం చార్యులు, డి వెంకటస్వామి ఐలూ నాయకులు ఆలూరి సుధాకరరావు, వడ్లమూడి రామకృష్ణ, రావి వెంకట్రావు, అనుమోలు వెంకటేశ్వరరావు ఎం బెంజిమెన్ మేక నాగేంద్ర ప్రసాద్, కారంనే నాగేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)