- ఆస్తులు, ఆదాయ పరిరక్షణకు డిపో మేనేజర్లు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలి
- ఆర్ టిసి జెఎండి ఎం శివప్రసాద్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆర్ టిసి డిపోల నిర్వహణలో ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత, జవాబుదారీతనానికి పెద్దపీట వేయాలని ఎపిఎస్ఆర్ టిసి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం శివప్రసాద్ డిపో మేనేజర్లకు సూచించారు. సంస్థ ఆస్తులు, ఆదాయ పరిరక్షణతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో డిపో మేనేజర్లు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. విజయవాడలోని ఆర్ టిసి హౌస్‌లో ఈనెల 10 నుంచి 20 వరకు నాలుగు బ్యాచ్‌లుగా నిర్వహించిన డిపో మేనేజర్ల ప్రత్యేక శిక్షణా ముగింపు సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడారు. డిపోల పరిధిలోని బస్సులు, భవనాలు, యంత్ర పరికరాలు, విద్యుత్ పరికరాలు తదితర ఆస్తుల వినియోగం, నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. బస్సుల మరమ్మతులు, బ్రేక్‌డౌన్ల నివారణ, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్యుత్ బస్సుల నిర్వహణలోనూ ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలన్నారు. బస్‌స్టేషన్లలో సురక్షిత తాగునీరు, కూర్చునే సదుపాయాలు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు.రోజువారీ ఆదాయం, ఆర్థిక లావాదేవీలు, రికార్డులు, రిజిస్టర్లు, సిబ్బంది విధుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. తప్పుడు నమోదులు, ఆర్థిక అవకతవకలు, ఆదాయానికి నష్టం కలిగించే చర్యలను ముందుగానే గుర్తించి అరికట్టాలని సూచించారు. నివేదికలను క్రాస్ చెక్ చేసి, అనుమానాస్పద లావాదేవీలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా సంస్థ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి సమష్టిగా కృషి చేయాలని శివప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రజలకు నాణ్యమైన రవాణా సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు(ఇడి) కెఎస్ బ్రహ్మానందరెడ్డి, జి వి రవివర్మ, ఎస్‌టిపి రాఘవకుమార్ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)