కలెక్టరేట్ కు తరలివచ్చిన 300 మందికి పైగా గ్రామస్థులు
యు-ఆకార డిజైన్‌ను విరమించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు వినతి...
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి గ్రామ పరిధిలోని రైల్వే గేట్ నెం.41 వద్ద ప్రతిపాదించిన రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి (ఆర్‌యూబీ)ని యు-ఆకారంలో నిర్మించవద్దని గ్రామస్థులు కోరారు. ఈ నిర్మాణాన్ని ప్రస్తుతం ఉన్న ప్రధాన రహదారి మీదుగా నేరుగా (స్ట్రెయిట్ అలైన్ మెంట్) నిర్మించేలా చర్యలు తీసుకోవాలని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలకు కంకణాలపల్లి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం సత్తెనపల్లి మండల కార్యదర్శి పెండ్యాల మహేష్ మాట్లాడుతూ.. యు-ఆకారంలో అండర్ బ్రిడ్జి నిర్మిస్తే గ్రామ ప్రజలు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. గ్రామ ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయమేనని, యు-ఆకార మార్గం వల్ల పంటలను మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులకు తరలించేందుకు చివరకు పొలానికి వెళ్లాలన్నా అదనపు దూరం ప్రయాణించాల్సి వస్తుందని తెలిపారు. దీనివల్ల రైతులపై రవాణా వ్యయం, ఇంధన ఖర్చు, సమయ భారం పెరుగుతుందని చెప్పారు. వర్షాకాలంలో అండర్ పాస్‌లో నీరు నిలిచిపోయే ప్రమాదం ఉండటంతో రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉందని, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు ఆలస్యంగా చేరుకునే పరిస్థితి తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రతిపాదనలు రూపొందించకూడదని, నిర్మాణానికి ముందు గ్రామసభ లేదా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు, విద్యార్థులు, గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాంకేతికంగా అనుకూలమైన డిజైన్‌ను అమలు చేయడంతో పాటు, వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే గేట్ నెం.41 వద్ద ప్రతిపాదించిన అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని ప్రధాన రహదారిపైనే నేరుగా (స్ట్రెయిట్ అలైన్ మెంట్) నిర్మించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన 300 మందికి పైగా గ్రామస్థులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)