రెండు తెలుగు రాష్ట్రాలకు కెఆర్ఎంబి సూచన
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :మిగులు జలాల వినియోగం పేరుతో తమ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కెఆర్ఎంబి) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను హెచ్చరించింది. కేటాయించని లేదా మిగులు జలాలు అందుబాటులో ఉంటాయనే అంచనా ఆధారంగా ప్రాజెక్టులు నిర్మించినంత మాత్రాన ఆ నీటిని వినియోగించుకునే చట్టబద్ధమైన హక్కు లభించదని స్పష్టం చేసింది. కొత్త ప్రాజెక్టులను చేపట్టే ముందు సంబంధిత బోర్డు నుంచి ప్రాజెక్టు మదింపు, సాంకేతిక అనుమతులు పొందడం తప్పనిసరని గుర్తుచేసింది.ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు గురువారం కెఆర్ఎంబి లేఖ రాసింది. అనుమతులు లేని ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపివేయాలని గతంలో ఇరు రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో బోర్డు తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లోని 11వ షెడ్యూల్లో పేర్కొన్న సూత్రం–7 ప్రకారం కొత్త ప్రాజెక్టులకు ముందస్తు మదింపు, సాంకేతిక అనుమతులు అవసరమని పేర్కొంది. ఈ నిబంధనలను రెండు రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.సాంకేతిక అనుమతులు, బోర్డు పరిశీలన లేకుండా చేపట్టే ప్రాజెక్టులపై బోర్డుదే తుది నిర్ణయమని వివరించింది. బోర్డు నిర్ణయాలను అమలు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో బోర్డు పరిధిని ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేసిన తెలంగాణా ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో బోర్డు జోక్యాన్ని కోరడం విరుద్ధ ధోరణిగా ఉందని వ్యాఖ్యానించింది. కెఆర్ఎంబి ఎస్ఇ-2 నారం వెంకటరమణ సంతకంతో వచ్చిన ఈ లేఖలో కృష్ణానది జలవివాదాల ట్రిబ్యునల్-2 అవార్డు పెండింగ్‌లో ఉన్న సమయంలో కెఆర్ఎంబి అధికార పరిధిపై సుప్రీం కోర్టులో కేసు దాఖలైన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు ఈ ఆదేశాలు జారీచేస్తున్నట్లు తెలిపారు. కృష్ణానదిపై చేపడుతున్న ప్రాజెక్టులకు నిలిపివేయాలని కోరుతూ రెండు రాష్ట్రాలు వేర్వేరుగా బోర్డుకు లేఖ రాశాయని తెలిపారు. నిలిపేసే అంశంపై బోర్డుకు పరిమితులు ఉన్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖ బోర్డు అధికార పరిధి నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ 2021లో సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ నెంబరు 666/2024 దాఖలు చేసిందని వివరించారు. షెడ్యూల్-2లో ఎంట్రీ 17 ప్రకారం ఇది రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ప్రభుత్వ అధికార దుర్వినియోగమని పేర్కొంటూ నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేయాలని పిటీషన్లో కోరిందని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014లో సెక్షన్ 85(8) కింద బోర్డు అధికార పరిధి విధులు ఉన్నాయని వివరించారు. అదే సమయంలో తెలంగాణా జలవనరులశాఖ బోర్డు అధికార పరిధికి సంబంధించిన నోటిఫికేషన్‌నే సవాల్ చేసిందని, మరలా బోర్డు జోక్యాన్ని కోరుతోందని తెలిపారు. కెఆర్ఎంబి నిబంధనల్లో క్లాజ్ 6(iii) ప్రకారం బోర్డు నిర్ణయాలను సాధారణంగా ఏకాభిప్రాయంతో తీసుకుంటారని, లేనిపక్షంలో క్లాజ్ 6(ii) కింద వాయిదా ప్రత్యేకంగా పేర్కొంటే మినహా ఆ అంశం అలాగే బోర్డు పరిధిలో ఉంటుందని పేర్కొన్నారు. అదే సమయంలో వివాదాస్పద అంశాలపై నిర్ణయం తీసుకునే విషయంలో బోర్డుకు కొన్ని పరిమితులు ఉన్నాయనీ, తెలంగాణా ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన కేసు దీన్ని మరింత జఠిలం చేసిందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 11వ షెడ్యూల్లో తొమ్మిదో నిబంధన ప్రకారం బోర్డు నిర్ణయాన్ని అమలు చేయడంలో విఫలమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే హక్కులు కల్పించారనీ, స్పష్టమైన ఆదేశాలు ఉంటే తప్ప ఎటువంటి నిర్ణయాలూ తీసుకోకూడదనీ తెలిపారు. విభజన చట్టంలో 11వ షెడ్యూలులో ఉన్న అంశాలను పాటించాలని రెండు రాష్ట్రాలకు పలుసార్లు సూచించామని పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్ ఆమోదానికి ముందు కొత్త ప్రాజెక్టులకు కెఆర్ఎం బోర్డు ముందస్తు పరిశీలన, సాంకేతిక అనుమతులు అవసరం ఉందని వివరించారు. ఈ లోపు మిగులు జలాలు ఉంటాయనే ఆలోచనల ఆధారంగా ప్రాజెక్టులు నిర్మించడం సరికాదని పేర్కొన్నారు. అలా చేపట్టడం వల్ల చట్టపరమైన హక్కులు వాటంతట అవే కల్పించేందుకు అవకాశం లేదని, దీన్ని కృష్ణాజలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంటుందని, అప్పటి వరకూ ప్రాజెక్టు నిర్మాణాలను ఆపేయాలని లేఖలో కోరారు.
ఇటీవల వివరాలు కోరిన బోర్డు
కృష్ణానదిపై ఇప్పటి వరకూ ఉన్న ప్రాజెక్టులు, కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి నీటి వినియోగ వివరాలు సమర్పించాలని ఇటీవల కెఆర్ఎంబి రెండు రాష్ట్రాలకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రాజెక్టులు చేపట్టవద్దని కోరుతూ మరోలేఖ రాయడం విశేషం. జలవివాదాలను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం సమస్యను జఠిలం చేసి రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మార్చిందనే విమర్శలూ వస్తున్న నేపథ్యంలో వివాదాలు పరిష్కారం కాకపోతే కేంద్రం జోక్యం చేసుకుంటుందని కెఆర్ఎంబి లేఖలో పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
తెలంగాణ ఫిర్యాదులు ఇవి...
కృష్ణాజలాలకు సంబంధించి నీటి పంపిణీల్లో నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ (డెడ్ స్టోరేజీ) నుండి ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పల్నాడు తాగునీటి సరఫరా పథకం అక్రమమని తెలంగాణ ప్రభుత్వం గతంలో కెఆర్‌ఎంబికి ఫిర్యాదు చేసింది. అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, ఆర్డిఎస్ కుడి కాలువ పనులను తక్షణమే నిలిపివేయాలని బోర్డును కోరింది.
ఎపి అభ్యంతరాలు ఇలా..
కృష్ణానది జలాలపై అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులపైనా ఎపి ప్రభుత్వం బోర్డుకు అధికారపూర్వకంగా ఫిర్యాదు చేసింది. వాటిల్లో పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని మళ్లిస్తున్నారని తెలిపింది.








కామెంట్లు (0)