ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జి) నిర్వహించిన రెండు ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర ఆక్టోపస్ బృందం ప్రథమ స్థానాలు సాధించి చరిత్ర సృష్టించింది. ఉగ్రవాద నిరోధక పోటీ అగ్ని పరీక్ష–12, బాంబు గుర్తింపు, నిర్వీర్య పోటీ విస్ఫోట్ కవచ్–10లో విజేతగా నిలిచింది. రాష్ట్ర పోలీస్ చరిత్రలో ఒకేసారి ఈ రెండు పోటీల్లో విజయం సాధించడం ఇదే తొలిసారి. హర్యానాలోని మానేసర్‌లో ఈనెల 2 నుంచి 14 వరకు జరిగిన అగ్ని పరీక్ష పోటీల్లో దేశవ్యాప్తంగా 26 కమాండో బృందాలు పాల్గొన్నాయి. శారీరక సామర్థ్యం, బందీల రక్షణ, గదుల్లో ఉగ్రవాదుల ఏరివేత, బస్సు దాడి నిరోధం, ఖచ్చితమైన కాల్పులు వంటి విభాగాల్లో ఆక్టోపస్ బృందం ప్రతిభ కనబరిచి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అదే వేదికపై ఈనెల9 నుంచి 14 వరకు జరిగిన విస్ఫోట్ కవచ్ పోటీల్లో 20 రాష్ట్రాల బాంబు గుర్తింపు, నిర్వీర్య బృందాలు పాల్గొన్నాయి. పేలుడు పదార్థాల గుర్తింపు, నిర్వీర్య ప్రక్రియలు, బందీలకు అమర్చిన పేలుడు పదార్థాల తొలగింపు, వాహనాల్లో అమర్చిన ఐఈడిల గుర్తింపు, నిర్వీర్యంలో ఎపి ఆక్టోపస్ విజేతగా నిలిచింది.ఈ విజయాలపై డిజిపి హరీష్ కుమార్ గుప్తా, ఐజి(ఆపరేషన్స్) శ్రీకాంత్ ఆక్టోపస్ సిబ్బందికి అభినందనలు ప్రశంసించారు. ప్రత్యేక శిక్షణ, నిరంతర సాధన, సమష్టి కృషితో జాతీయ స్థాయిలో రాష్ట్ర పోలీస్‌కు గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు.
రాష్ట్ర అక్టోపస్‌కు జాతీయ స్థాయిలో డబుల్ విక్టరీ
14 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 14, 2026, 10:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)