గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజెడ్‌పి పీఠాల ఎన్నికకు సర్వం సిద్ధం..

54 నిమిషాల క్రితం

జెడ్‌పి పీఠాల ఎన్నికకు సర్వం సిద్ధం..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 12:31 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 28 జిల్లాల్లో 20న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు

  • మధ్యాహ్నం 3 గంటలకు ఛైర్మన్ ఎన్నిక

  • చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని 28 జిల్లా పరిషత్‌లకు ఈ నెల 20వ తేదీ శుక్రవారం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు ఈ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. తొలుత కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ చేపట్టి, అనంతరం ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లను ఎన్నుకోనున్నారు.ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలలోపు కో-ఆప్టెడ్ సభ్యుల నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన చేపడతారు. మధ్యాహ్నం 12 గంటలకు చెల్లుబాటు అయ్యే నామినేషన్లను ప్రకటించి, మధ్యాహ్నం 1 గంటలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక నిర్వహించి, ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. ఛైర్మన్ ఎన్నిక పూర్తయిన వెంటనే వైస్ ఛైర్మన్ ఎన్నిక చేపడతారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తారు.

​జెడ్‌పిటిసిలకే ఓటు హక్కు..

ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో ఎన్నికైన ​జెడ్‌పిటిసిలకే సభ్యులందరికీ ఓటు హక్కు ఉంటుంది. ఎంపి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరుకావచ్చు తప్ప ఓటు హక్కు ఉండదు. కొత్తగా ఎన్నికైన కో-ఆప్టెడ్ సభ్యులకు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు లేదు. ఓటింగ్ ప్రక్రియ చేతులెత్తే పద్ధతిలో నిర్వహిస్తారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ సభ్యులకు జారీ చేసిన విప్‌ను పాటించాల్సి ఉంటుంది. విప్‌కు సంబంధించిన సమాచారాన్ని ప్రిసైడింగ్ అధికారికి ముందుగానే అందజేయాలి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్