- సిఎస్ సాయి ప్రసాద్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 14, 15 తేదీల్లో విజయవాడ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ఆయన వివిధ శాఖల అధికారులతో వర్చువల్ సమావేశాన్ని సోమవారం నిర్వహించి చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి సచివాలయం నుండి జారీ అయన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ఎక్కడా జాప్యం లేకుండా సమయపాలనకు అనుగుణంగా నిర్వహించేలా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సంబంధిత శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. అంతకు ముందు సమావేశానికి వర్చువల్‌గా హాజరైన రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామల రావు మాట్లాడుతూ.. భారత రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి వివిధ శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై శాఖల వారీగా వివరాలను తెలియజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు సంబంధించి డ్రాప్టు ముసాయిదా ప్రయాణ సమాచారం ప్రకారం వివరాలను వెల్లడిస్తూ.. ‘ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 3.55 గంటలకు రాష్ట్రపతి ఢిల్లీ నుండి విమానంలో బయలుదేరి సా.6.25 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గంలో విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకుని రాత్రి 7.20 గంటల నుండి 7.40 వరకు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రాత్రికి విజయవాడలో బస చేస్తారు.15వతేది ఉదయం 11.30 గంటలకు పున్నమీ ఘాట్ చేరుకుని ఉదయం11.30గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకూ అక్కడ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సరస్ మేళాలో ముఖ్య అతిధిగా పాల్గొంటారు. తదుపరి మధ్యాహ్నం 1గం.10 నిమిషాల నుండి 2గం.ల10 నిమిషాల వరకూ స్వయం సహాయక సంఘాలు-లాక్పతి దిదిలతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాష్ట్రపతి మధ్యాహ్నం 2.45 గన్నవరం విమానాశ్రయం చేరుకుని ఢిల్లీ బయలుదేరి వెళతారు’ అని తెలిపారు. ఈ వర్చువల్ సమావేశంలో అదనపు డిజిపి మదుసూదన్ రెడ్డి, పిఆర్‌ఆర్డి ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, సెర్ప్ సిఇఒ కరుణ, ఎన్టిఆర్ జిల్లా కలక్టర్ లక్ష్మిషా, ఐఅండ్ పిఆర్ డైరెక్టర్ కెఎస్.విశ్వనాధన్, దుర్గగుడి ఇఒ శీనూనాయక్, ప్రోటోకాల్ విభాగం జె.రామసుబ్బయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)