- అభివృద్ధి కోసం సొంత ఊరు త్యాగం
- భావోద్వేగాల నడుమ పునరావాస కాలనీకి మూలపేట నిర్వాసితులు
- లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయింపు
ప్రజాశక్తి– సంతబొమ్మాళి (శ్రీకాకుళం జిల్లా) : సముద్రపు అలల సవ్వడి... తంపర భూముల్లో చెమటోడ్చిన రోజుల జ్ఞాపకాలు... జీడి, మామిడి తోటల మధ్య గడిచిన బాల్యం... ఊరి ఆలయాల్లో నిర్వహించుకున్న పండగలు... ఒకే వీధిలో తరతరాలుగా కలిసి జీవించిన బంధాలు... ఇవన్నీ ఇప్పుడు జ్ఞాపకాలుగా మిగిలిపోనున్నాయి. గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణం కోసం పుట్టి పెరిగిన మూలపేట గ్రామాన్ని విడిచి పునరావాస కాలనీకి వెళ్లాల్సిన పరిస్థితి రావడంతో నిర్వాసితుల కళ్లలో కొత్త జీవితంపై ఆశతో పాటు సొంత ఊరిని వదిలిపెట్టాల్సిన వేదన స్పష్టంగా కనిపిస్తోంది. సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు నిర్మాణం వల్ల నిర్వాసితులైన గ్రామస్తులకు పునరావాస కాలనీలో లాటరీ పద్ధతిలో ఫ్లాట్లను అధికారులు కేటాయించారు. మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు చెందిన మొత్తం 594 ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలను (పిడిఎఫ్‌లు) గుర్తించారు. విష్ణుచక్రం గ్రామ నిర్వాసితులకు ఇప్పటికే ప్లాట్ల కేటాయింపు పూర్తి కాగా, అక్కడ నిర్మాణాలు వేగంగా పూర్తి కావచ్చాయి. తాజాగా మూలపేటకు చెందిన మిగిలిన 511 ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలకు లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించి, కుటుంబ బంధాలు, సామాజిక అనుబంధాలు కొనసాగేందుకు వీలుగా 91 క్లస్టర్లుగా విభజించి ప్రతి కుటుంబానికీ ప్లాట్ కేటాయించారు. ఆర్‌డిఒ ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ కేటాయించిన ప్లాట్లలో త్వరలోనే గృహ నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. స్థల కేటాయింపు పత్రాలను త్వరలో అందజేస్తామని తెలిపారు. అంతకుముందు నిర్వాసితులు పునరావాస కాలనీలో గుడి, పాఠశాల, అంతర్గత రహదారులు, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను పూర్తిగా ఏర్పాటు చేయాలని కోరారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న 14 ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాల్లో ఆరు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు అధికారులు అంగీకరించగా, కొంతమందికి పరిహారం చెల్లించారు. మరి కొంతమంది అన్నదమ్ములు వివాదాలు కొనసాగుతూ ఉండడంతో వారికి పరిహారం పెండింగ్‌లో పెట్టారు. వీటితోపాటు నౌపడ మూడు రోడ్లు కూడలు వద్ద ఉన్న ఇళ్లకు రెండు సెంట్ల చొప్పున స్థలాల కేటాయించారు. భూమి లేని నిర్వాసితులకు ఆర్థికసాయం అందించే అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని ఆర్‌డిఒ ఇచ్చిన హామీ అలాగే మిగిలిపోయింది. ప్రస్తుతానికి వివాదాలతో సాంకేతిక సమస్యలతో పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని చెల్లించాలని వారందరికీ తమతోపాటే పునరవాసి కాలనీకి తరలించాలని పలువురు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
తరలించేందుకు అధికారుల తాపత్రయం
వారం రోజుల క్రితం గ్రామంలో దండోరా వేయించి ఇళ్లను ఖాళీ చేసి సామగ్రిని తరలించాలని అధికారులు కోరారు. దీంతో, కొంతమంది నిర్వాసితులు స్వచ్ఛందంగా తమ సామగ్రితో నౌపడ, టెక్కలి పరిసర ప్రాంతాల్లో అద్దె ఇళ్లకు వెళ్లిపోతుండగా, మరికొందరు తాత్కాలిక నివాసాల్లో ఉంటూ పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు ఆర్ఆర్ కాలనీలో వందలాది మంది కార్మికులు, ప్రొకెయినర్లు, నిర్మాణ సామగ్రితో నిత్యం సందడి నెలకొంది. అదే సమయంలో మూలపేట చుట్టూ పోర్టు అధికారులు ఇసుక నింపి, తదుపరి పనులకు సన్నాహాలు చేస్తుండడంతో గ్రామాన్ని వీడే క్షణాలు మరింత దగ్గరపడుతున్నాయి.








కామెంట్‌లు (0)